Site icon NTV Telugu

Medical Revolution in AP: అడవి బిడ్డలకు ‘సంజీవని’ డ్రోన్లు.. ఏపీలో సరికొత్త వైద్య విప్లవం..!

Sanjivini Drones

Sanjivini Drones

AP Medical Drones : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లోని అట్టడుగు వర్గాలకు ఆధునిక వైద్యాన్ని చేరువ చేసేందుకు సరికొత్త సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ‘సంజీవని’ మెడికల్ డ్రోన్ల పైలట్ ప్రాజెక్టును విజయవంతంగా నిర్వహించడం ద్వారా వైద్య రంగంలో సరికొత్త శకం మొదలైంది. కొండలు, కోనలు, వాగులు దాటుకొని ఆసుపత్రికి వెళ్లడం గగనమయ్యే మారుమూల గ్రామాల ప్రజలకు ఈ డ్రోన్లు ఇప్పుడు కల్పవల్లిలా మారాయి.

Sai Durga Tej : కథ నచ్చి.. ఆ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సాయిదుర్గాతేజ్‌

అల్లూరి జిల్లాలోని 2,191 గిరిజన ఆవాసాలకు సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో, అత్యవసర సమయాల్లో గర్భిణీలను, బాధితులను డోలీల ద్వారా కిలోమీటర్ల మేర మోసుకెళ్లడం అక్కడి ప్రజలకు నిత్యకృత్యం. ఈ ప్రయాణంలో జరిగే జాప్యం వల్ల ఎంతో మంది అర్ధాయుష్షుతోనే మరణిస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా, బెంగళూరుకు చెందిన ‘రెడ్ వింగ్’ సంస్థతో కలిసి ప్రభుత్వం డ్రోన్ సేవలను ప్రారంభించింది. రోడ్డు మార్గంలో ఒక ప్రాంతానికి వెళ్లడానికి గంటల సమయం పడితే, ఈ డ్రోన్లు కేవలం 15 నుండి 20 నిమిషాల్లోనే అక్కడకు చేరుకొని అత్యవసర మందులను అందజేస్తున్నాయి.

ఈ మెడికల్ డ్రోన్లు సాధారణ డ్రోన్లలా కాకుండా పూర్తిగా ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తాయి. ఇవి సాటిలైట్ ట్రాకింగ్ సహాయంతో నిర్దేశించిన పాయింట్‌కు చేరుకుంటాయి. ప్రస్తుతం ఇవి 100 కిలోమీటర్ల రేడియస్ వరకు ప్రయాణిస్తూ, సుమారు 5 కేజీల బరువున్న మెడిసిన్స్, వ్యాక్సిన్లు , బ్లడ్ ప్యాకెట్లను మోసుకెళ్లగలవు. కుండపోత వర్షం పడితే తప్ప, సాధారణ గాలి , జల్లులను తట్టుకొని ఇవి స్థిరంగా ప్రయాణించగలవు. పాడేరు డిగ్రీ కాలేజీని ప్రధాన హబ్‌గా చేసుకొని ఈ ఆపరేషన్లను నిర్వహిస్తున్నారు.

ఈ డ్రోన్ల వినియోగం కేవలం ఒక వైపునకే పరిమితం కాదు. ఇవి జిల్లా ఆసుపత్రి నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు (PHCs) అత్యవసర యాంటీ-వెనం (పాము కాటు మందు), వ్యాక్సిన్లు చేరవేయడమే కాకుండా, తిరుగు ప్రయాణంలో అక్కడ సేకరించిన రోగుల రక్త నమూనాలను పరీక్షల కోసం తిరిగి మెయిన్ ఆసుపత్రికి తీసుకొస్తాయి. దీనివల్ల రిపోర్టులు త్వరగా రావడం, తద్వారా వైద్యులు సకాలంలో చికిత్స అందించడం సాధ్యమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, సాంకేతికతను సామాన్యుడి ప్రాణాలను కాపాడేందుకు వాడుతుండటంపై గిరిజన ప్రాంతాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Taapsee Pannu : తప్పు పరిశ్రమది కాదు.. చూసే ప్రేక్షకులది!

Exit mobile version