NTV Telugu Site icon

Blind Girl Murder Case: తాడేపల్లిలో అంధ బాలిక హత్యపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు..!

Blind Girl Murder

Blind Girl Murder

Blind Girl Murder Case: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఎన్టీఆర్‌ కట్ట ప్రాంతంలో మైనర్‌ బాలిక దారుణ హత్యకు గురైన విషయం విదితమే.. ఆ అంధ బాలిక హత్యపై హోంమంత్రి తానేటి వనిత కీలక వ్యాఖ్యలు.. ఆ బాలికను గంజాయి మత్తులో హత్య చేయలేదు.. వ్యక్తిగత కక్షతోనే అంధ బాలికను హత్య చేశారని స్పష్టం చేశారు.. అయితే, ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజంలేదని కొట్టిపారేశారు హోంమంత్రి తానేటి వనిత.. కాగా, తాడేపల్లిలోని ఎన్టీఆర్‌ కట్ట ప్రాంతంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న అంధురాలిపై అదే ప్రాంతంలో ఉంటున్న దుండగుడు రాజు కత్తితో దాడి చేశాడు. తలపై కొట్టడంతో తీవ్రగాయాలపాలైన యువతి.. అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆ తర్వాత తల్లి వచ్చేసరికి మృతి చెందింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తన బిడ్డను రాజు అన్యాయంగా చంపేశాడని మృతురాలి తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. గంజాయి సేవించి వచ్చి, తన కూతురుపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని చెబుతోంది. గంజాయి ముఠా ఆగడాలు పెరిగి పోయాయని… తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా చూడాలని వేడుకుంది.

Read Also: Tourist Police Stations: టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లకు శ్రీకారం.. 26 పీఎస్‌లను ప్రారంభించిన సీఎం జగన్

మైనర్ బాలిక హత్యపై రాష్ట్ర మహిళ కమిషన్ స్పందించింది. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలోని మృతదేహాన్ని పరిశీలించిన మహిళ కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హమీ ఇచ్చారు. TDP కార్యకర్తల తీరుపై మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఫైరయ్యారు. టీడీపీ శవ రాజకీయాలు చేయడం మానుకోవాలంటూ మండిపడ్డారు. అంధ బాలిక హత్య… శాంతి భద్రతల వైఫల్యమే అన్నారు జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌. ముఖ్యమంత్రి ఇంటికి దగ్గరలో ఘాతుకాలు జరుగుతున్నా… ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. రాజు చేతిలో కిరాతంగా హత్యకు గురైన బాలిక కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలంటూ ఉదయం నుంచి విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద మహిళ సంఘాలు ఆందోళన చేపట్టాయి. దీంతో అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం మైనర్ బాలిక కుటుంబానికి 10లక్షలతో పాటు ఇంటి స్థలం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మహిళ సంఘాలు రాత్రి దీక్ష విరమించుకున్నాయి. మైనర్‌పై దారుణానికి ఒడిగట్టిన రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడి రాజుకి నేర చరిత్ర కూడా ఉంది. గతంలోనూ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో పలు కేసులు ఉన్నాయి. హత్యయత్నం కేసుతో పాటు చాలా కేసులో రాజు నిందితుడిగా ఉన్నాడు.

Show comments