AP High Court: తెలుగులో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ షోపై మరో వివాదం చెలరేగింది. బిగ్‌బాస్-6ను సెన్సార్ చేయకుండా నేరుగా ప్రసారం చేస్తున్నారని.. ఈ షో హింస, అశ్లీలం, అసభ్యత ప్రోత్సహించే విధంగా ఉందని ఆరోపిస్తూ నిర్మాత, సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం నాడు విచారణ చేపట్టిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు పరిష్కరించే ముందు అసలు ఈ షోలో ఏముందో తెలుసుకునేందుకు తాము ఒకట్రెండు ఎపిసోడ్లు బిగ్‌బాస్ చూస్తామని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అప్పుడే తమకు ఓ అవగాహన వస్తుందని కోర్టు అభిప్రాయపడింది. అటు బిగ్ బాస్ షోలో పాల్గొనే మహిళా కంటెస్టెంట్స్‌కు ప్రెగ్నెన్సీ టెస్టులు చేస్తున్నారని.. ఇలాంటి కార్యక్రమాలను నిబంధనల ప్రకారం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటలలోపు ప్రసారం చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపించారు.
Read Also: Cyber Attack : సైబరాబాద్‌లో కొత్త రకం సైబర్ అటాక్
ఈ మేరకు బిగ్‌బాస్ షోకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఏపీ హైకోర్టు ఆదేశించింది. మరోవైపు ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని పిటిషనర్ కోరగా ప్రస్తుతం నోటీసులు ఇవ్వలేమని ధర్మాసనం తెలిపింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈనెల 27వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. కాగా కొంతకాలంగా బిగ్‌బాస్ షోను నిషేధించాలనే డిమాండ్లు ఎక్కువ అవుతున్నాయి. నాలుగు గోడల మధ్య జరగాల్సిన వ్యవహారాన్ని ఏకంగా రికార్డ్ చేసి టీవీలలో చూపిస్తున్నారని, సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని సీపీఐ నేత నారాయణతో పాటు పలువురు సామాజిక కార్యకర్తలు గతంలోనే ప్రశ్నించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా షోను రద్దు చేయాలని కోరారు. కుటుంబ సభ్యులతో కలిసి చూడలేని ఈ షోను బ్యాన్ చేయాలని పలువురు తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్నారు.