AP High Court Issued Notice To Vallabhaneni Vamsi: టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. వంశీ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారిస్తున్న కోర్టు.. తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేసింది. 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా వంశీ, వైసీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో వంశీ విజయం సాధించిన తర్వాత.. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి వంశీ గెలుపొందాడని, అతని ఎన్నికను రద్దు చేయాలని యార్లగడ్డ వెంకట్రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బాపులపాడులో ఎమ్మార్వో స్టాంపు ఫోర్జరీ చేసి.. 12 వేల నకిలీ ఇళ్ళపట్టాలను తన అనుచరులకు వంశీ పంచారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు.. ప్రసాదంపాడు పోలింగ్ బూత్‌లో రిగ్గింగ్ చేసినట్టు వంశీపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారని వెల్లడించారు.
అయితే.. పిటిషన్ దాఖలు చేసి రెండేళ్ల పైనే అవుతున్నా, ఇప్పటివరకు ప్రతివాదులకు నోటీసులు ఇవ్వలేదని పిటిషనర్ వెంకట్రావు కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. కొవిడ్ కారణంగా ఆలస్యమైనా.. ఇప్పటికీ విచారణ చేయకపోవడంతో పిటిషన్ వల్ల ఫలితం లేకుండా పోతుందని, ఇప్పటికైనా ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆయన కోర్టుని కోరారు. వెంకట్రావు వాదనలు విన్న ధర్మాసనం.. ఎమ్మెల్యే వంశీతో పాటు గన్నవరం రిటర్నింగ్ అధికారి, కేంద్ర ఎన్నికల సంఘాలకు నోటీసులు జారీ చేసింది. అనంతరం.. తదుపరి విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలావుండగా.. టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలుపొందినా, క్రమంగా వంశీ వైసీపీ పార్టీకి చేరువవుతూ వచ్చారు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో తాను వైసీపీ అభ్యర్థిగా గన్నవరం నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
