ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.. ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పోరేషన్ లిమిటెడ్‌ను విద్యుత్ పంపిణీ సంస్థగా మార్చేసింది… ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పోరేషన్ పేరును ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ సప్లై కంపెనీ (ఏపీ రాస్కామ్ )గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది వైఎస్ జగన్ సర్కార్.. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పంపిణీ కోసం విద్యుత్ పంపిణీ సంస్థగా ఏపీ రాస్కామ్ పనిచేయనుంది… ప్రస్తుతానికి రాష్ట్రంలోని మూడు డిస్కంలకు చెందిన విద్యుత్ పంపిణీ వ్యవస్థను వినియోగించుకుని సేవలు అందించనుంది ఏపీ రాస్కామ్. మూడు డిస్కంల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పంపిణీ లైన్లను వినియోగించుకునేందుకు వీలింగ్ ఛార్జీలను రాస్కామ్ చెల్లించనుంది. పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేసుకునేంత వరకూ డిస్కంలకూ వీలింగ్ ఛార్జీల చెల్లింపునకు నిర్ణయం తీసుకున్నారు.
ఇక, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాతో ప్రస్తుత డిస్కంలు కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఏపీ రాస్కామ్ కు బదిలీ చేయాలని నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏపీలోని మూడు డిస్కంలకు ఏపీ రాస్కామ్ చెల్లించే వీలింగ్ ఛార్జీలు, విద్యుత్ ట్రాన్స్ మిషన్ ఛార్జీలు, ఫీడర్ సెగ్రిగేషన్ ఛార్జీలు, ఇతర వ్యయాన్ని ఎలక్ట్రిసిటీ డ్యూటీగా వినియోగదారుల నుంచి వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది. కాగా, విద్యుత్ రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.