Site icon NTV Telugu

Suryalanka Beach Incident: సూర్యలంక బీచ్‌లో ఆరుగురు మృతి.. ప్రభుత్వం సీరియస్

Suryalanka Beach Incident

Suryalanka Beach Incident

AP Govt Fires On Police Officials Over Suryalanka Beach Incident: బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ వరుస విషాదాలకు కేంద్రంగా మారుతోంది. తాజాగా బీచ్ వద్దకు విహారయాత్రకు వచ్చిన విద్యార్థుల్లో ఆరుగులు మృత్యువాత పడ్డారు. విజయవాడకు చెందిన మొత్తం ఎనిమిది విద్యార్థులు బీచ్‌లో స్నానం చేస్తుండగా.. నీళ్లలో మునిగిపోయారు. ఇద్దరిని మత్స్యకారులు కాపాడారు కానీ, మిగిలిన ఆరుగురే గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు కొట్టుకురాగా.. మరో ఇద్దరి మృతదేహాల్ని పోలీసులు వెలికి తీశారు. కానీ, ఇంకో ఇద్దరి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విద్యార్థులందరూ ఇంటర్మీడియట్ చదువుతున్నారు.

ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. సూర్యలంక తీరంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని అధికారుల్ని ఆదేశించిన ప్రభుత్వం.. 24 గంటల పాటు పోలీస్ నిఘా ఏర్పాటు చేయాలని సూచించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పింది. ప్రమాదాలు చోటు చేసుకుంటే, వెంటనే చర్యలు తీసుకునే విధంగా అలర్ట్‌గా ఉండాలని పేర్కొంది. మరోవైపు.. సరదాగా సమయం గడిపేందుకు బీచ్‌కు వచ్చిన తమ పిల్లలు ఇలా మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. భవిష్యత్తులో తమకు తోడుగా ఉంటారన్న పిల్లలకు తామే పాడే కట్టాల్సిన దౌర్భాగ్యం వస్తుందని ఊహించలేదంటూ కన్నీటిపర్యంతమవుతున్నారు.

కాగా.. సూర్యలంక బీచ్‌లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా చాలామంది ఇలాగే విహారయాత్రకు వచ్చి, సముద్రంలో మునిగిపోయారు.

Exit mobile version