Buggana Rajendranath Reddy: లోక్‌సభలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2023-24పై సంతృప్తి వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇది గుడ్ బడ్జెట్.. అన్ని రాష్ట్రాలు కూడా రాజకీయాలను పక్కన పెట్టి పరిస్థితులను అర్ధం చేసుకోవాలని సూచించారు. కేంద్ర బడ్జెట్ 45 లక్షల కోట్లు.. అయితే, ప్రీ బడ్జెట్‌లో మేం చెప్పిన నాలుగు సూచనలను కేంద్రం పాటించినట్లు కనిపిస్తుందన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక, వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపును రూ.5 లక్షల నుంచి 7 లక్షల రూపాయలకు పెంచటం ఆహ్వానించదగిన అంశం.. ఓవర్ ఆల్‌గా ట్యాక్స్ రూపంలో సగటు వ్యక్తులకు లాభదాయకంగా ఉంటుందన్నారు. అయితే, వ్యవసాయం, పౌర సరఫరాలకు బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గాయి.. కేంద్రం నుండి రాష్ట్రాలకు వస్తున్న వాటా ఈసారి ఇంకా తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Union Budget 2023: వ్యవసాయాభివృద్ధి కోసం రూ.20 లక్షల కోట్ల రుణాలు
ఫిషరీస్ మేత దిగుమతి సుంకం తగ్గించమని అడిగాం.. కేంద్రం ఆ మేరకు నిర్ణయం తీసుకుందని ఆనందం వ్యక్తం చేశారు.. విద్య, విద్యుత్, రోడ్లు, మౌలిక సదుపాయాల్లో కేటాయింపులు పెరిగాయి.. దేశ అప్పు గత ఏడాది కంటే 50 వేల కోట్లు పెరిగింది.. విమానాశ్రయాలు, పోర్టులపై శ్రద్ధ కూడా రాష్ట్రానికి ఉపయోగపడే అవకాశం ఉంటుందన్నారు.. మరోవైపు.. మూడు రాజధానుల వ్యవహారంపై స్పందించిన బుగ్గన.. విశాఖకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టమైన ప్రకటన చేశారని గుర్తుచేశారు.. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే సీఎం ఆఫీస్ అవుతుందన్నారు ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.