వ్యవసాయ మోటార్లకు కూడా మీటర్లు పెట్టడమేంటి? అంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నా.. కేంద్రం ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తూనే ఉంది.. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో గృహ, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగింపు ప్రక్రియ ప్రారంభం అయ్యింది.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం.. దీనిపై వ్యతిరేక వ్యక్తమవుతూనే ఉంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఈ మీటర్ల బిగింపు ప్రక్రియ ప్రారంభం అయ్యింది.. దీనిపై ఏపీ ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ విజయానంద్ మాట్లాడుతూ.. కేంద్రం ఆదేశాల మేరకే గృహ, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నామని స్పష్టం చేశారు.. ఆర్డీఎస్ఎస్ స్కీములో భాగంగా మార్చి 2025 నాటికి అన్ని చోట్లా స్మార్ట్ మీటర్లు పెట్టాలని కేంద్రం స్పష్టం చేసిందని.. 2019లోనే స్మార్ట్ మీటర్లకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు.
వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలని 2020 డిస్ట్రిబ్యూటర్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసిందన్నారు విజయనంద్.. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్ల బిగింపు ఖర్చును మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని.. గృహ, పరిశ్రమలు, వాణిజ్య విద్యుత్ కనెక్షన్ల బిగింపు ఖర్చులను సోషలైజ్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు.. రాష్ట్రంలోని 18.56 లక్షల వ్యవసాయ కనెక్షన్లను స్మార్ట్ మీటర్లు పెట్టనున్నాం. రియల్ టైమ్ డేటా తీసుకునేందుకు స్మార్ట్ మీటర్లు ఎంతో ఉపయోగ పడతాయన్నారు. స్మార్ట్ మీటర్లపై అపోహలొద్దు.. అంతా పారదర్శకంగానే సాగుతోందని వెల్లడించారు ఏపీ ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ విజయానంద్.
