పోలీసుశాఖలో రిక్రూట్‌మెంట్ పై అపోహలు, అనుమానాలు వద్దని తెలిపారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్… మహిళా సంరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలను చేపడుతూ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్న ఆయన.. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తూ మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారమయ్యే దిశగా ముందుకు కదులుతోందన్నారు.. ప్రతి గ్రామంలో ఒక మహిళ రూపంలో పోలీసు శాఖ ప్రతినిధి ఉండాలనే ఉద్దేశ్యంతో, గ్రామ సచివాలయంలో గ్రామ/ వార్డ్ మహిళ సంరక్షణ కార్యదర్శి అనే పోస్టును సృష్టించి సుమారు 15,000 మందిని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. వీరి సేవలను మరింత విస్తృత పరచాలన్న ఉద్దేశ్యంతో గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళ పోలీసుగా గుర్తిస్తూ ఈ మధ్యనే ఉత్తర్వులను జారీ చేశామని.. పోలీసు శాఖ ప్రతినిధిగా, మహిళా పోలీసులు ప్రతి ఇంటి గడప వద్దకు వెళ్లి అద్భుతమైన సేవలను అందిస్తున్నారని.. ఇప్పటికే, 20 లక్షల మంది పైగా మహిళలు దిశా యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవడంలో ప్రముఖ పాత్రను పోషించారని.. అంతే కాకుండా, ఏపీ పోలీసు సేవా యాప్ ద్వారా 96 పోలీస్ సేవలను అందిస్తున్నట్టు వెల్లడించారు.
పోలీసు శాఖలో శిక్షణ అనేది కీలకమైన అంశం అనే విషయాన్ని గుర్తించాలి.. కఠోర శిక్షణ ఏపీ పోలీసులను అత్యున్నత స్థానంలో నిలబెడుతోందన్నారు డీజీపీ గౌతమ్ సవాంగ్.. అందుకే ఈ మహిళ పోలీసులకు కూడా అత్యున్నత శిక్షణ ఇచ్చేందుకు పూనుకొన్నాం. ఇప్పటికే ప్రాథమిక శిక్షణ పూర్తయ్యింది. విడతల వారిగా క్యాప్సూల్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం అన్నారు.. ఏపీ పోలీసుశాఖలో శిక్షణ ఇచ్చే వనరులు పరిమితమన్న విషయాన్ని గుర్తించాలి. మన సామర్థ్యం చూస్తే, కేవలం విడతకు 6500 మందికి మాత్రమే శిక్షణ ఇవ్వగలం. 15000 మంది మహిళా పోలీసుకు క్యాప్సూల్ ట్రైనింగ్ ఇవ్వడానికి మరి కొన్ని నెలలు పట్టే అవకాశం ఉందన్నారు.. ఇక, 14 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయలేదు అనే విషయం లో నిజానిజాలను చూస్తామన్న ఆయన.. ముందుగా 15 వేల మహిళా పోలీసులు పోలీసు శాఖలో చేరారన్న విషయాన్ని గుర్తించాలన్నారు. పోలీసుశాఖలో మహిళా భాగస్వామ్యం 33 శాతం ఉండాలన్న జాతీయ మార్గదర్శకాలకు అనుగుణంగా వీరి నియామకం చేపట్టడంతో ఏపీ పోలీసుశాఖ కీర్తిని ఇనుమడింప చేస్తున్నదనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. మరోవైపు 2019 – 20లో ఇప్పటికే 3,057 మంది కానిస్టేబుళ్లను రిక్రూట్ చేసుకొని, శిక్షణ ఇచ్చి డ్యూటీలో చేర్చుకొన్నాం.. ఇంకా 11 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు డీజీపీ. రెండేళ్ల కాల వ్యవధిలో 1,84,264 రెగ్యులర్ ఉద్యోగాలు, కాంట్రాక్టు పద్ధతి ద్వారా 19,701 ఉద్యోగాలు, ఔట్ సౌర్చింగ్ ద్వారా 3,99,791 ఉద్యోగాలు, డీఎస్సీ ద్వారా 2,193 మొత్తం 6,05,949 ఉద్యోగాలు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు.