Operation Firewall 2026: పాక్ ఏజెంట్లకు సహకారం.. బీహార్‌లో ఇద్దరిని అరెస్ట్ చేసిన ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం

Ap Counter Intelligence

Ap Counter Intelligence

Operation Firewall 2026: పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లకు సహకరిస్తూ దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా వ్యవహరిస్తున్న ఇద్దరు భారతీయ యువకులను ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ (APCI) విభాగం అధికారులు అరెస్ట్ చేశారు. బీహార్‌కు చెందిన రాజ్ కుమార్ (24), ఆదిత్య పాండే (23)లుగా గుర్తించిన ఈ నిందితులను ఇండో-నేపాల్ సరిహద్దుల్లోని రక్సౌల్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్-2026’ పేరిట నిర్వహించిన రహస్య ఆపరేషన్‌లో భాగంగా ఈ అరెస్టులు చోటుచేసుకున్నాయి.

సిమ్ కార్డులు, వాట్సాప్ ఓటీపీల ద్వారా నెట్‌వర్క్

అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితులు భారతీయ సిమ్ కార్డుల ఓటీపీలను (OTP) సరిహద్దు ఆవల ఉన్న పాకిస్తాన్ ఏజెంట్లకు చేరవేశారు. ఆ ఓటీపీల ఆధారంగా పాక్ ఏజెంట్లు భారతీయ నంబర్లతో కూడిన వాట్సాప్ ఖాతాలను యాక్టివేట్ చేసుకున్నారు. సాధారణ భారతీయ నంబర్లుగా కనిపించే ఈ ఖాతాల ద్వారా భారత సైనిక సిబ్బంది, ఇతర ఉద్యోగులను సంప్రదిస్తూ నిఘా వర్గాలు అనుమానించకుండా సమాచారం రాబట్టే పన్నాగం పన్నారు. ఈ సహకారానికి ప్రతిఫలంగా నేపాల్ సరిహద్దు మార్గాల ద్వారా పాక్ ఏజెంట్ల నుంచి నిందితులిద్దరూ భారీ మొత్తంలో హవాలా రూపంలో నగదు అందుకున్నట్లు దర్యాప్తులో తేలింది.

వైజాగ్ నేవల్ బేస్ సమాచారం లీక్?

ఈ వాట్సాప్ ఖాతాలను ఉపయోగించి విశాఖపట్నంలోని ఈస్టర్న్ నావల్ కమాండ్‌కు సంబంధించిన కీలక వివరాలను పాక్ ఏజెంట్లు సేకరించినట్లు అధికారులు గుర్తించారు. భారత రక్షణ రంగంలో అత్యంత వ్యూహాత్మకమైన యుద్ధనౌకలు, జలాంతర్గాములు (సబ్‌మెరైన్లు), వాటి కదలికలకు సంబంధించిన అత్యంత రహస్య వివరాలను నిఘా వర్గాల కన్నుగప్పి సేకరించినట్లు సమాచారం.

ఇప్పటికే ఇద్దరి అరెస్ట్

ఇదే గూఢచర్యం నెట్‌వర్క్‌పై దృష్టి సారించిన APCI, గతంలోనే వైజాగ్ నావికాదళ కార్యాలయంలో సివిలియన్ కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పనిచేస్తున్న అన్నం సాయి వరప్రసాద్‌తో పాటు మరో ఉద్యోగిని అరెస్ట్ చేసింది. వీరిని విచారించగా వెలుగుచూసిన సాంకేతిక ఆధారాలతో రాజ్ కుమార్, ఆదిత్య పాండేల పాత్ర నిర్ధారణ అయింది. పక్కా సమాచారంతో బిహార్ చేరుకున్న ప్రత్యేక బృందాలు నిందితులను పట్టుకుని విజయవాడకు తరలించాయి. ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న మరికొందరి కోసం అధికారులు గాలింపు ముమ్మరం చేశారు.