NTV Telugu Site icon

Andhra Pradesh: సీఎంవోకు చేరిన గన్నవరం పంచాయతీ

Vallabaneni Vamsi Mohan

Vallabaneni Vamsi Mohan

గన్నవరం నియోజకవర్గంలోని వైసీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు మధ్య కొంతకాలంగా గ్రూప్ తగాదాలు నడుస్తున్నాయి. ఈ విషయం సీఎంవో వరకు వెళ్లడంతో వారిద్దరికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. వీరి పంచాయతీ వివాదంపై పరిష్కరించేందుకు తొలుత బుధవారం సాయంత్రం రావాలని ఆదేశించినా… అనంతరం గురువారం సాయంత్రం 6గంటలకు తాడేపల్లికి రావాలని సీఎంవో సూచించింది.

Crime News: గుంటూరు జిల్లాలో గుజరాత్ కి’లేడీ’లు.. దోపిడీ పక్కా..!!

గన్నవరం అంటే టీడీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గం. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా టీడీపీ నుంచి వల్లభనేని వంశీ విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం రాకపోవడంతో వల్లభనేని వంశీమోహన్ భవిష్యత్ అవసరాల దృష్ట్యా అధికార పార్టీ వైసీపీలో జంప్ అయ్యారు. ఆయన వైసీపీలోకి అడుగుపెట్టిన నాటి నుంచి గన్నవరం వైసీపీలో రచ్చ జరుగుతూనే ఉంది. వల్లభనేని వంశీ తన సొంత వర్గానికే ప్రాధాన్యత ఇస్తూ అసలైన కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని వైసీపీ అధిష్టానానికి పలుమార్లు ఫిర్యాదులు అందాయి. మరోవైపు గన్నవరం వైసీపీ ఇంఛార్జిని నియమించాలని వైసీపీ కార్యకర్తలు అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. వల్లభనేని వంశీని పక్కన పెట్టి నిజమైన వైసీపీ నాయకుడికి ఇంఛార్జి బాధ్యతలు ఇవ్వాలని వాళ్లు కోరుతున్నారు. ప్రస్తుతం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతుండటంతో వల్లభనేని వంశీ, దుట్టా రామచంద్రరావు వర్గాల మధ్య మరోసారి ఆధిపత్య పోరు ప్రారంభమైంది. దీంతో వీరి వివాదంపై పరిష్కారం చూపేందుకు సీఎం కార్యాలయం దృష్టి సారించింది.