వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి కన్నుమూయడంతో.. ఇప్పుడు ఆయన రాజకీయ వారసులు ఎవరు? అనే చర్చ మొదలైంది.. ఇవాళ అవుకు మండలం ఉప్పలపాడు గ్రామంలో భగీరథ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు.. అక్కడికి వెళ్లిన సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. భగీరథ రెడ్డి భౌతికకాయాన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యారు.. దివంగత ఎమ్మెల్సీ కుటుంబాన్ని ఓదార్చి, ధైర్యం చెప్పారు.. చల్లా భగీరథ పిల్లలు, వారి చదువులపై ఆరా తీసిన సీఎం జగన్.. చల్లా కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. ఇదే సమయంలో.. చల్లా భగీరథరెడ్డి వారసుడు ఎవరు? చల్లా ఫ్యామిలీ రాజకీయ భవిష్యత్తు ఏంటి? అనేదానిపై కూడా దృష్టిసారించారు.. చల్లా రాజకీయ భవిష్యత్తుపై కుటుంబంతో చర్చించి సూచన చేయాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి సూచించారు సీఎం వైఎస్ జగన్.
Read Also: Munugode By Poll : సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్
ఇక, ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన దివంగత ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి భార్య శ్రీలక్ష్మి.. చల్లా భగీరథ రెడ్డి ఆశయాల కోసం పని చేస్తానని తెలిపారు.. మా మామయ్య చల్లా రామకృష్ణా రెడ్డి, మా వారు చల్లా భగీరథ రెడ్డి జనం కోసమే పని చేశారని గుర్తుచేసుకున్నారు.. అయితే, నా రాజకీయ భవిష్యత్తుపై సీఎం వైఎస్ జగన్, నా కుటుంబ సభ్యులే నిర్ణయిస్తారని తెలిపారు.. జెడ్పీటీసీగా గెలిచిన సమయంలో జరిగిన మీటింగ్‌లో నేను మాట్లాడితే.. చాలా బాగా మాట్లాడవని భగీరథ చెప్పేవారని గుర్తుచేసుకున్న ఆమె.. నన్ను రాజకీయంగా కూడా ప్రోత్సహించారన్నారు.. అంతేకాదు.. మా కొడుకులను భగీరథ రెడ్డి ఎప్పుడూ ఎక్కడికి వెళ్లినా తన వెంట తీసుకెళ్లేవారని వివరించారు చల్లా శ్రీలక్ష్మి.. అయితే, చల్లా ఫ్యామిలీ రాజకీయ భవిష్యత్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, భగీరథ రెడ్డి రాజకీయ వారసులు ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది.