Site icon NTV Telugu

YS Jagan Mohan Reddy: ముర్ము జీవితం.. ప్రతీ మహిళకు ఆదర్శనీయం

Ys Jagan On Murmu

Ys Jagan On Murmu

YS Jagan Mohan Reddy Comments On Draupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పౌర సన్మాన కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశచరిత్రలో తొలిసారిగా ఓ గిరిజన మహిళ రాష్ట్రపతి పదవి చేపట్టడం, ప్రతి ఒక్కరికీ గర్వకారణమని అన్నారు. రాష్ట్రపతి పదవిలో ద్రౌపది ముర్మ తొలిసారి రాష్ట్రానికి వచ్చారు కాబట్టి.. ఆమెను గౌరవించడం మనందరి బాధ్యతగా భావించి ఈ పౌర సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఒక సామాజిక వేత్తగా.. ఒక ప్రజాస్వామ్యవాదిగా.. అణగారిన వర్గాల కోసం అచంచలమైన కృషి చేసిన వ్యక్తిగా.. అన్నింటికి మించి ఒక గొప్ప మహిళగా ఎదిగిన ముర్మ జీవితం.. దేశంలోని ప్రతి ఒక్కరికీ ఎంతో ఆదర్శనీయమని కొనియాడారు. ఈ దేశంలో ఎవరైనా ఎంతటి స్థానానికైనా చేరుకోగలరు అని చెప్పడానికి ద్రౌపది ముర్ము ఒక గొప్ప ఉదాహరణగా నిలిచిపోతారని ప్రశంసించారు.

జీవితంలో ముర్ము ఎన్నో కష్టాలు పడ్డారని, ఆ కష్టాలను చిరునవ్వుతో స్వీకరించి.. సంకల్పంతో ముందుకు సాగిన తీరు, ఈ దేశంలోని ప్రతి ఒక్క మహిళకు స్పూర్తిదాయకమని వైఎస్ జగన్ అన్నారు. ఒరిస్సాలో అత్యంత వెనుకబడిన ఓ ప్రాంతంలోని ఒక గిరిజన కుటుంబంలో జన్మించిన ముర్ము.. ప్రాథమిక విద్యను సైతం పూర్తి చేసేందుకు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. చదువుకోవాలి, చదువు మాత్రమే జీవితాలను మారుస్తుందని గట్టిగా విశ్వసించిన ఆమె.. భువనేశ్వర్‌లో బీఏ పూర్తి చేశారన్నారు. తన గ్రామంలో డిగ్రీ వరకు చదివిన ఏకైక మహిళ ముర్ము అని, అప్పట్లో ఇది విశేషమని పొగిడారు. మహిళా సాధికారితకు ఆమె ఒక ప్రతిబింబమని.. రాష్ట్రపతి పదవికి ముర్ము వన్నె తీసుకొస్తారనడంలో ఎలాంటి సందేహం లేదని జగన్ వెల్లడించారు. దేశ చరిత్రలో ఆమె ఎప్పటికీ నిలిచిపోతారని పేర్కొన్నారు.

అంతకుముందు.. దేశాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని ఆకాంక్షిస్తున్నానని ద్రౌపది ముర్ము అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్న ముఖ్యమంత్రి జగన్‌కు అభినందనలు తెలిపారు. తిరుమల, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉండే ఈ నేలపై అడుగుపెట్టడం తనకు ఆనందంగా ఉందన్నారు. కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి వంటి నదులు ఈ రాష్ట్ర నేలను సారవంతం చేశాయన్నారు. నాగార్జున సాగర్, నాగార్జున కొండ, అమరావతి.. భారతదేశ చారిత్రక వారసత్వ సంపద అని తెలిపారు. కూచిపూడి నృత్యం భారత సాంస్కృతిక వైశిష్ట్యమని పేర్కొన్నారు.

Exit mobile version