NTV Telugu Site icon

YS Jagan Mohan Reddy: అంబానీ, అదానీలు ఏపీ వైపే చూస్తున్నారు

Ys Jagan Mohan Reddy

Ys Jagan Mohan Reddy

అంబానీ, ఆదానీల చూపు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ వైపు ఉందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. అనకాపల్లి అచ్యుతాపురం సెజ్‌లో ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వైపు వేగంగా అడుగులు పడుతున్నాయన్నారు.. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మూడేళ్లుగా అవార్డు తీసుకుంటున్నాం. జపాన్‌ కంపెనీకి ప్రపంచంలోనే ఐదో స్థానం ఉంది. అలాంటిది 15 నెలల్లోనే ఏటీసీ టైర్ల పరిశ్రమను స్థాపించగలిగామని సగర్వంగా ప్రకటించారు. దేవుడి దయతో ఒక పరిశ్రమ ఇవాళ ప్రారంభమైంది.. రెండో ఫేజ్‌ పనులకూ శంకుస్థాపన చేశాం. యొకహొమా కంపెనీ ప్రపంచంలోనే 5–6 స్థానాల్లో ఉంది.. అలాంటి కంపెనీ మన రాష్ట్రానికి రావడం సంతోషకరం అన్నారు. అన్ని రకాలుగా మనం సహాయ సహకారాలు అందించాం.. 2021 ఫిబ్రవరిలో ఫ్యాక్టరీ పనులు ప్రారంభమయ్యాయని.. 15 నెలల కాలంలో ఉత్పత్తి మొదలైంది.. మనం ఇచ్చే ప్రోత్సాహం, మద్దతుతో వారిని ఆకట్టుకుందని.. అందుకే రెండో విడతకూ నాంది పలికారని పేర్కొన్నారు.

Read Also: ATG Tyres Company: టైర్ల కంపెనీని ప్రారంభించిన సీఎం జగన్..

ఆగస్టు 2023లో పూర్తి చేస్తామని తెలిపారన్న సీఎం జగన్.. మొదటి విడతలో రూ.1250 కోట్ల పెట్టుబడి పెట్టారు.. 1200 మందికి దాదాపుగా ఉద్యోగాలు కల్పిస్తున్నారు. రెండో ఫేజ్‌లో రూ.850 కోట్లు వెచ్చిస్తున్నారు.. మరో 800 మందికి ఉద్యోగాలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు.. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే.. ఆ ప్రాంతంలోని చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు అందించాలి.. అప్పుడే పేదరికం నుంచి బయట పడతారని.. దీనికోసం ప్రభుత్వం నుంచి వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నాం అన్నారు. ఈ మూడు సంవత్సరాల కాలంలోనే 98 అతిభారీ, భారీ పరిశ్రమలు రూ.39,350 కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యాయని గుర్తుచేశారు. 60,541 మందికి ఉద్యోగాలు ఈ మూడేళ్లలో కల్పించామని.. 31,671 ఎంఎస్‌ఎంఈలు కూడా రూ.8,285 కోట్లతో 1,98,521 మందికి ఉద్యోగాలను ఈ మూడేళ్లలో కల్పించారని వెల్లడించారు. రాబోయే ఒకటి రెండు సంవత్సరాల్లో మరో 56 అతిభారీ, భారీ పరిశ్రమలు దాదాపుగా రూ. 1,54,000 పెట్టుబడితో ఏర్పాటవుతున్నాయని.. 1,64,155 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాచని ప్రకటించారు.

రాష్ట్రంలో వేగంగా పారిశ్రామిక రంగంలో అడుగులు పడుతూ ఉన్నాయి.. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో దేశంలోనే నంబర్‌ 1గా గత మూడేళ్లుగా అవార్డులు తీసుకుంటున్నామని వెల్లడించారు సీఎం జగన్.. మొట్ట మొదటి సారిగా ఈ సారి సర్టిఫికేషన్‌ చేయటానికి దాని తీరును కూడా మార్చారు. ఆ రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక వ్యక్తులతో వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్‌ ఇస్తున్నారు. అలా రూల్స్‌ మార్చిన నేపథ్యంలో వరుసగా మూడేళ్లుగా ఏపీ నంబర్‌ 1 ర్యాంకు సాధిస్తోందన్నారు. ప్రతి అడుగులో కూడా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాం. గతంలో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇచ్చేవారు కాదు.. చిన్నా చితకా పరిశ్రమలు నడవలేక మూతబడుతున్న పరిస్థితులు ఉండేవని.. ప్రస్తుతం లక్షకు పైగా ఎంఎస్‌ఎంఈలు రాష్ట్రంలో ఉన్నాయి.. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఏటా గుర్తు పెట్టుకుని పాత బకాయిలను క్లియర్‌ చేస్తూ, మరోవైపు ఎలాంటి బకాయిలు లేకుండా ఇన్సెంటివ్‌లు అందిస్తున్నాం అన్నారు. రూ.1463 కోట్లు మూడేళ్లలో ఎంఎస్‌ఎంఈలకు ఇచ్చాం.. 2020–21 చూస్తే జీఎస్‌డీపీ గ్రోత్‌రేట్‌ 11.43 శాతం సాధించామని.. కానీ, దేశంలో చూస్తే ఇది కేవలం 8.9శాతమే అన్నారు.

దేశంతో పోలిస్తే.. రాష్ట్రం వేగంగా అడుగులు ముందుకేస్తోందన్నారు సీఎం వైఎస్‌ జగన్.. ఎగుమతుల్లో 3 ఏళ్ల కాలంలో వేగంగా మరో 4 పోర్టులు కట్టేందుకు ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నాం.. 9 ఫిషింగ్‌ హార్బర్లుకూడా నిర్మిస్తున్నాం.. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక హార్బర్‌ కాని, ఒక పోర్టునుకాని అందుబాటులోకి తెస్తున్నాం అని ప్రకటించారు.. ఇవి పూర్తి అయితే 10శాతం ఎగుమతులు ఏపీ నుంచే జరుగుతాయన్నారు. 3 ఇండిస్ట్రియల్‌ కారిడర్లు ఏపీలో మాత్రమే ఉన్నాయన్నారు.. విశాఖ – చెన్నై, చెన్నై – బెంగుళూరు, హైదరాబాద్‌ – బెంగుళూరు కారిడర్‌లు ఉన్న రాష్ట్రం ఏపీ మాత్రమేనని.. గతంలో మన రాష్ట్రంవైపు చూడని వారు కూడా ఇప్పుడు మన వైపు చూస్తున్నారు.. పారిశ్రామిక వేత్తలందరికీ ఒకటే మాట చెప్తున్నాం.. మీరు పరిశ్రమ పెట్టండి.. అన్నిరకాలుగా తోడుగా ఉంటాం… వారిని చేయిపట్టుకుని నడిపిస్తున్నాం అని ఆహ్వానించారు సీఎం వైఎస్‌ జగన్..