NTV Telugu Site icon

ప్ర‌ధానికి సీఎం జ‌గ‌న్ లేఖ‌.. ఐఏఎస్‌లను అలా పంపితే మా పరిస్ధితేంటీ..?

ఐఏఎస్ అధికారుల సర్వీస్ నిబంధనల్లో సవరణలు ప్రతిపాదించిన త‌ర్వాత క్ర‌మంగా కేంద్రంపై ఒత్తిడి పెరుగుతూ వ‌స్తోంది.. అఖిల భార‌త స‌ర్వీసుల (ఏఐఎస్‌) రూల్స్‌- 1954 కి కేంద్రం చేసిన సవ‌ర‌ణ ప్ర‌తిపాద‌న‌లు కేంద్ర -రాష్ట్ర సంబంధాల మ‌ధ్య చిచ్చురేపాయి. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి.. ఈ మేర‌కు ఆయా రాష్ట్రాల సీఎంలు ప్ర‌ధాని న‌రేంద్ర మోడికి లేఖ‌లు కూడా రాశారు.. మధ్యప్రదేశ్, మేఘాలయ, బీహార్ వంటి ఎన్డీయే పాలిత రాష్ట్రాలు కూడా స‌వ‌ర‌ణ‌పై అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిందే కాగా.. తాజాగా ఈ జాబితాలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ కూడా చేరిపోయింది..

Read Also: ప‌ద్మ‌శ్రీ మొగిల‌య్య‌కు సీఎం కేసీఆర్ భారీ సాయం..

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు సీఎం వైఎస్ జ‌గ‌న్.. కేంద్రానికి డిప్యూటేషన్ పై పంపించే ఐఏఎస్ అధికారుల ఎంపిక విషయంలో రాష్ట్రాలకే నిర్ణయాధికారం ఉండాలని లేఖలో పేర్కొన్నారు జ‌గ‌న్.. ఐఏఎస్ అధికారుల సర్వీస్ నిబంధనల్లో సవరణలు ప్రతిపాదించిన కేంద్రం.. రాష్ట్రాల నుంచి అభిప్రాయాలు కోరింది.. రాష్ట్రాల నుంచి కేంద్రానికి డిప్యుటేషన్ పై పంపించే ఐఏఎస్ అధికారుల అంశంలో సవరణలు తీసుకుని వస్తున్న కేంద్ర చొరవను అభినందించిన సీఎం జగన్.. అయితే రాష్ట్రాలు నిర్భ్యంతర పత్రాలు విడుదల చేసిన తర్వాతే డిప్యూటేషన్ ఖరారవుతున్న ప్రస్తుత విధానాన్ని కొనసాగించాల‌ని లేఖ‌లో పేర్కొన్నారు.. డిప్యూటేషన్ పై వచ్చే ఐఏఎస్ అధికారి రిపోర్ట్ చేసే గడువును నిర్ణయించే అధికారాన్ని కేంద్రానికి కట్టబెడుతూ తీసుకుని వస్తున్న తాజా సవరణ పై అభ్యంతరం వ్యక్తం చేశారు ఏపీ సీఎం.. ఉన్న‌ట్టుండి కీలక బాధ్యతల్లో ఉండే అధికారులు వెళ్ళిపోతే పాలనలో ఇబ్బందులు ఎదురవుతాయని లేఖ‌లో ప్ర‌ధాని దృష్టికి తీసుకెళ్లారు..