NTV Telugu Site icon

బద్వేల్‌లో వైసీపీ గ్రాండ్‌ విక్టరీ.. ఎవ్వరినీ వదలని సీఎం వైఎస్‌ జగన్

బద్వేల్‌ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గ్రాండ్‌ విక్టరీ కొట్టింది.. ఏకంగా 90,533 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ సుధ ఘన విజయం సాధించారు. ప్రతీ రౌండ్‌లోనూ వైసీపీ ఆధిక్యం సాదిస్తూ దూసుకెళ్లింది.. మొత్తంగా వైసీపీకి 1,12,211 ఓట్లు పోలుకాగా.. బీజేపీకి 21,678 ఓట్లు వచ్చాయి.. ఇక, కాంగ్రెస్‌ పార్టీకి 6,235 ఓట్లు వచ్చాయి. దీంతో.. బీజేపీ, కాంగ్రెస్‌ డిపాజిట్‌ కోల్పోయాయి. ఇక, బద్వేల్‌ ఉప ఎన్నిక ఫలితంపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి.. ఎవ్వరినీ వదలకుండా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

బద్వేల్ గెలుపుపై సోషల్‌ మీడియాలో స్పందించిన సీఎం వైఎస్‌ జగన్.. ట్విట్టర్ ద్వారా నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.. బద్వేల్‌ అసెంబ్లీ ఉపఎన్నికలో అఖండ విజయాన్ని అందించిన ప్రతి అక్కచెల్లెమ్మకు, అవ్వాతాతకు, ప్రతి ఆత్మీయ సోదరునికి పేరుపేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్న ఏపీ సీఎం.. శాసన సభ్యురాలిగా గెలుపొందిన డా. సుధమ్మకు నా అభినందనలు అంటూ ట్వీట్‌ చేశారు.. ఇక, దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైందన్న ఆయన.. ఈ గెలుపు ప్రజాప్రభుత్వానికి, సుపరిపాలనకు మీరిచ్చిన దీవెనలుగా భావిస్తూ.. మరింత మంచి చేసేందుకు కృషి చేస్తాను అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు సీఎం వైఎస్‌ జగన్.