NTV Telugu Site icon

CM Jagan: ఏపీలో వరద ప్రభావిత జిల్లాలకు సీనియర్ అధికారుల నియామకం

Cm Jagan

Cm Jagan

గోదావరి వరదలు – సహాయ కార్యక్రమాలపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఏరియల్‌ సర్వే తర్వాత ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్సీలు ఇతర అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా వరద ప్రభావిత జిల్లాలకు ఒక్కో సీనియర్‌ అధికారిని నియమించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు కార్తికేయ మిశ్రా. తూర్పుగోదావరి జిల్లాకు అరుణ్‌కుమార్, డా. బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాకు ప్రవీణ్‌ కుమార్, ఏలూరు జిల్లాకు కాటమనేని భాస్కర్‌ను నియమించారు. వచ్చే 24 గంటలు చాలా కీలకమని.. హైఅలర్ట్‌గా ఉండాలని గోదావరి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను సీఎం జగన్ ఆదేశించారు.

Read Also: Facebook : ఇది మీకు తెలుసా.. ఒకే ఖాతాలో ప‌లు ప్రొఫైల్స్‌

మరోవైపు వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల నుంచి ఎలాంటి సహాయం కోరినా యుద్ధ ప్రాతిపదికిన వారికి అందించేలా చూడాలని అన్ని విభాగాల సీఎస్‌లకు సహా అన్ని విభాగాల కార్యదర్శులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. సీఎంవో కార్యదర్శులు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటారని, గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. శనివారం కూడా గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశాలు ఉండడంతో.. లంక గ్రామాలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలని సీఎం జగన్ సూచించారు. వరద బాధితులకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలన్నారు. బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి కుటుంబానికీ 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కిలో పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, పాలు వంటివి అందించాలని ఆదేశించారు.