ప్రకాశం జిల్లా చీమకుర్తిలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. చీమకుర్తిలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు.
-
వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించే ఎన్నికలకు వెళ్తాం-జగన్
వెలిగొండ ప్రాజెక్టు ఒకటి, రెండు టన్నెల్ పనులు వైఎస్ హయాంలో పరుగులు పెట్టాయని.. చంద్రబాబు వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు పనులు తూతూ మంత్రంగా చేశారని సీఎం జగన్ ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి టన్నెల్ పూర్తి చేశామని.. రెండో టన్నెల్ 2023 సెప్టెంబర్ కల్లా పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామని జగన్ ప్రకటించారు. వెలిగొండ ప్రాజెక్టుతో జిల్లా రూపు రేఖలు మారతాయని.. జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ వెంకాయమ్మ కోరిక ప్రకారం.. కొత్త జెడ్పీ కార్యాలయం కోసం రూ.20 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. తాళ్లూరు మండలం శివరామపురంలోని మొగిలిగుండాల ప్రాజెక్టుకు బూచేపల్లి సుబ్బారెడ్డి మొగిలిగుండాల ప్రాజెక్టుగా నామకరణం చేస్తున్నామన్నారు.
-
గ్రానైట్ పరిశ్రమలకు సీఎం జగన్ వరాలు
గ్రానైట్ పరిశ్రమల నడ్డి విరిచేలా గత ప్రభుత్వంలో చంద్రబాబు విధానాలు ఉన్నాయని సీఎం జగన్ ఆరోపించారు. గ్రానైట్ పరిశ్రమ ఆదుకునేలా చర్యలు తీసుకుంటున్నామని.. ప్రభుత్వానికి ఏడాదికి రూ.135 కోట్ల నష్టం వస్తున్నా పరిశ్రమల మంచి కోసం ముందుకు వెళ్తున్నామని తెలిపారు. చిన్న గ్రానైట్ పరిశ్రమలు చంద్రబాబు హయాం నుంచి ఉన్న కరెంట్ ఛార్జీలు యూనిట్‌కు రూ.2 తగ్గిస్తామని ప్రకటించారు. ప్రభుత్వానికి ఎంత నష్టం వచ్చినా లక్షల్లో ఉన్న కార్మికుల మంచి కోసం ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని సీఎం జగన్ పేర్కొన్నారు.
-
స్లాబ్ సిస్టం విధానాన్ని మళ్లీ తీసుకువస్తున్నాం-జగన్
గ్రానైట్ పరిశ్రమల విషయంలో మహానేత వైఎస్ఆర్ హయాంలో మాదిరిగానే స్లాబ్ విధానాన్ని మళ్లీ తాము తీసుకువస్తున్నామని.. ఈరోజే జీవో నంబర్ 58 విడుదల చేశామని సీఎం జగన్ ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో ఎక్కువ గ్రానైట్ పరిశ్రమలు ఉండటంతో సింగిల్ బ్లేడ్‌కు రూ.27వేలు, మల్లీ బ్లేడ్‌కు నెలకు రూ.54వేలు ఇ చ్చేలా స్లాబ్ సిస్టమ్ తీసుకువస్తున్నామని పేర్కొన్నారు.
-
మేనిఫెస్టోలో 95 శాతం హామీలను నెరవేర్చాం-సీఎం జగన్
రైతుల సంక్షేమం అంటే గుర్తుకొచ్చేపేరు వైఎస్ఆర్ అని.. ఇప్పటికే తమ మేనిఫెస్టోలోని 95 శాతం హామీలను నెరవేర్చామని.. ఏప్రిల్ 14న విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని సీఎం జగన్ ప్రకటించారు.
-
జగన్‌ను చూస్తే టీడీపీ నేతలకు ప్యాంటులు తడిచిపోతున్నాయి
రాష్ట్రంలో అభివృద్ధి లేదని టీడీపీ నేతలు పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని.. జగన్‌ను చూస్తుంటే వాళ్లకు ప్యాంటులు తడిచిపోతున్నాయని సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ఆరోపించారు. ఒక్క సంతనూతలపాడు నియోజకవర్గానికే రూ.3,087 కోట్లను సీఎం జగన్ కేటాయించారని తెలిపారు. ఇళ్లపట్టాలు, పెన్షన్ కానుక, రైతు భరోసా, అమ్మ ఒడి, విద్యాదీవెన, సున్నా వడ్డీ రుణాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ డబ్బులను కేటాయించారని వివరించారు.
-
సభలో సీఎం జగన్ నవ్వులు
చీమకుర్తి బహిరంగ సభ వేదికపై జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ వెంకాయమ్మ పాట పాడారు. ఎక్కడున్నావు రాజశేఖరన్నా.. మళ్లీ ఎప్పుడొస్తావు రాజశేఖర్ అన్నా అని పాట పాడారు. ఈ పాటకు సీఎం జగన్ నవ్వులు చిందించారు. అంతేకాకుండా స్వయంగా కుర్చీలో నుంచి లేచి వెళ్లి పాటను ఆపించి వెంకాయమ్మను పట్టుకుని తీసుకువెళ్లి కుర్చీలో కూర్చోబెట్టారు.
-
బహిరంగ వేదిక వద్దకు చేరుకున్న సీఎం జగన్
- చీమకుర్తిలో బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకున్న ఏపీ సీఎం జగన్
- కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని సందర్శించిన సీఎం జగన్
- జిల్లా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, చీమకుర్తి నగర పంచాయతీ కౌన్సిల్ సభ్యులతో ఫోటో సెషన్ లో పాల్గొన్న సీఎం జగన్
-
వైఎస్ఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన జగన్
చీమకుర్తి మెయిన్‌రోడ్డులోని బూచేపల్లి సుబ్బారెడ్డి కల్యాణ మండపం వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను సీఎం జగన్ ఆవిష్కరించారు.
-
చీమకుర్తి చేరుకున్న జగన్
ఏపీ సీఎం జగన్ ప్రకాశం జిల్లా చీమకుర్తి చేరుకున్నారు.
