ఏపీ సీఎం జగన్ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇటీవల దావోస్ టూర్ వెళ్లిన ఆయన త్వరలో పారిస్ వెళ్లబోతున్నారు. అయితే ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు సీఎం జగన్ పారిస్ పర్యటన ఖరారైంది. ఆయన ఈ నెల 28న పారిస్ వెళ్లనున్నారు. పారిస్‌లోని ఓ ప్రసిద్ధ బిజినెస్ స్కూల్‌లో సీఎం జగన్ పెద్ద కుమార్తె హర్షారెడ్డి ఆర్థిక శాస్త్రం చదువుతోంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ డిగ్రీ పూర్తయిన తర్వాత పారిస్‌లో ఆమె మాస్టర్స్ అభ్యసిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 2వ తేదీన జరిగే ఆమె కాన్వకేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం జగన్ తన కుటుంబంతో సహా పారిస్ పయనం కానున్నారు.
కాగా జగన్ పెద్ద కుమార్తె హర్షారెడ్డి ప్యారిస్ వెళ్లేటప్పుడు సీఎం జగన్ ప్రత్యేకంగా బెంగళూరు వెళ్లి సెండాఫ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తయినట్లుగా తెలుస్తోంది. దీంతో కాన్వకేషన్ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. అటు సీఎం జగన్ చిన్న కుమార్తె కూడా లండన్‌లోనే చదువుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇటీవల జగన్ సోదరి షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి అమెరికాలోని యూనివర్శిటీలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేశాడు. ఆ సెర్మనీలో పాల్గొనేందుకు వైఎస్ షర్మిల తన పాదయాత్రకు విరామం ఇచ్చి మరీ అమెరికా వెళ్లారు. వైఎస్ విజయమ్మ, షర్మిల భర్త అనిల్ కుమార్, మరో కుమార్తెతో కలిసి గ్రాడ్యూయేషన్ వేడుకల్లో పాల్గొన్నారు.