ఏపీలో త్వరలో మరో క్రికెట్ సమరం ప్రారంభం కానుంది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టీ-20 టోర్నీ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లోగో, టీజర్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు. సీఎం నివాసంలో సీఎం జగన్‌ను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. జూలై 6 నుంచి జూలై 17 వరకు విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్‌ఆర్ ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో టోర్నమెంట్ జరగనుంది.
జూలై 17న జరిగే ఫైనల్‌కు హాజరుకావాలని సీఎం జగన్‌ను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఐపీఎల్ తరహాలో మ్యాచ్‌లను నిర్వహిస్తున్నామని.. ఏపీఎల్ నిర్వహించుకునేందుకు బీసీసీఐ నుంచి అనుమతులు కూడా పొందామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. స్థానికంగా ప్రీమియర్ లీగ్ నిర్వహించుకునేందుకు ఇప్పటికే తమిళనాడు, కర్నాటక, సౌరాష్ట్రకు బీసీసీఐ అనుమతులు ఇవ్వగా నాలుగో రాష్ట్రంగా ఏపీ నిలవడం విశేషం.
