గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని కొలనుకొండలో ఇస్కాన్ సంస్థ నిర్మిస్తున్న శ్రీకృష్ణ ఆలయం, గోశాలకు సీఎం జగన్ శుక్రవారం నాడు భూమిపూజ చేశారు. రూ.70 కోట్లతో శ్రీకృష్ణ ఆలయం, యువత కోసం యోగా ధ్యాన కేంద్రాలను ఇస్కాన్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ప్రభుత్వం దేవాదాయ శాఖకు చెందిన భూమిని కేటాయించింది. అనంతరం రూ.20 కోట్లతో ఇస్కాన్ అక్షయపాత్ర ఏర్పాటు చేసిన ఆధునిక కిచెన్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. జగనన్న గోరుముద్ద పథకానికి అక్షయపాత్ర ఫౌండేషన్ భోజనాన్ని అందించనుంది. అక్షయపాత్ర ద్వారా రెండు గంటల్లో 50 వేల మందికి భోజనం అందించేలా ఆధునిక కిచెన్‌ను ఏర్పాటు చేశారు.
అక్షయపాత్ర కిచెన్ ప్రారంభోత్సవం తర్వాత చిన్నారులతో కలిసి సీఎం జగన్ ఫోటోలు దిగారు. అనంతరం విద్యార్థులకు సీఎం జగన్ స్వయంగా భోజనాలు వడ్డించారు. ఆ తర్వాత ఆయన కూడా భోజనాన్ని రుచి చూశారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, గుంటూరు జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే శిలాఫలకంపై పేరు లేకపోవడంతో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత మాత్రం గైర్హాజరు అయ్యారు.
