NTV Telugu Site icon

Christmas: క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే బాలయ్య

Christmas

Christmas

Christamas: ఆదివారం క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఏపీ ప్రజలకు సీఎం జగన్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. కరుణ, ప్రేమ, దాతృత్వం, త్యాగం వంటి వాటిని క్రీస్తు తన జీవితం ద్వారా మానవాళికి అందించించిన గొప్ప సందేశాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు కరుణామయుడి ఆశీస్సులు, దీవెనలు లభించాలని జగన్ ఆకాంక్షించారు.

మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణ, సేవలతో కూడిన శాంతియుత జీవన మార్గాన్ని ఏసు ఈ ప్రపంచానికి అందించారని చంద్రబాబు అన్నారు. ప్రేమ అన్నది మానవ లక్షణమని, సాటి మనిషి పట్ల ప్రేమను, కనికరాన్ని కలిగి ఉండాలని క్రీస్తు మనకు బోధించారన్నారు. లోకానికి నిస్వార్థ సేవా మార్గాన్ని సూచించారని కొనియాడారు. తనకు కీడు తలపెట్టినా స్వార్థపరులను సైతం క్షమించగలిగాడు కాబట్టే ప్రజలు ఆయనను దైవ కుమారుడిగా భావించి ప్రార్థిస్తున్నారని అన్నారు. సమాజం కోసం జీవితాన్ని, చివరికి ప్రాణాలను సైతం అర్పించిన త్యాగమూర్తి అని అన్నారు. ఆయన మార్గం అందరికీ ఆచరణీయమని పేర్కొన్నారు. కరుణామయుడైన ఏసు దీవెనలు అందరికీ లభించాలని, ఈ క్రిస్మస్ అందరికీ సంతోషాన్ని, ప్రశాంతతను పంచాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

అటు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మానవులలో ప్రేమ, కరుణ, శాంతి వెల్లివిరియాలని, ఆ గుణాలు ఉన్నప్పుడే మనిషి పరిశుద్ధుడు అవుతాడని క్రీస్తు బోధించారని తెలిపారు. మానవాళి అభివృద్ధికి శాంతి ఎంతో ముఖ్యమని చెప్పారని, అందుకనే ఆయనను ‘ప్రిన్స్ ఆఫ్ పీస్’ అంటారని బాలకృష్ణ పేర్కొన్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కూడా రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. జీసస్ తన జీవితం ద్వారా సన్మార్గానికి బాటలు వేశారని అన్నారు. ఆయన బోధనలు ఆచరణీయమని అన్నారు. ఈ క్రిస్మస్ అందరిలోనూ సంతోషం నింపాలని కోరుకుంటున్నట్టు అభిప్రాయపడ్డారు.