NTV Telugu Site icon

ఏపీ సీఎం కీలక నిర్ణయం.. ఆ చట్ట సవరణకు అంగీకారం !

సహకార శాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి వ్యవసాయ, సహకారశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సహకార బ్యాంకులు, ప్రాథమిక సహకార వ్యవసాయ పరపతి సంఘాల పనితీరుపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. కడప, కర్నూలు, అనంతపురం, ఏలూరు డీసీసీబీలు నిర్వీర్య దశలో ఉన్నాయని సీఎంకు అధికారులు వివరించారు. వాటి లైసెన్స్‌లు కూడా రద్దయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 45 శాతం పీఏసీఎస్‌లు పూర్తిగా నష్టాల్లో ఉన్నాయని అధికారులు తెలిపారు.

49 శాతం మండలాలకు డీసీసీబీ బ్రాంచ్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానం లేదని తక్కువగా రుణాలు ఇవ్వడంతో పాటు మోసాలు అధికంగా జరుగుతున్నాయని సీఎంతో అధికారులు పేర్కొన్నారు. నాబార్డ్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌- సిఫార్సులపై కూడా సమావేశంలో చర్చించారు. ఆప్కాబ్, డీసీసీబీలు‌, పీఏసీఎస్‌లను కంప్యూటరీకరణ చేయాలని సూచనలు చేసిన సీఎం పీఏసీఎస్‌ల్లో క్రమం తప్పకుండ ఆడిటింగ్‌ చేయించాలని ఆదేశించారు. రిపోర్టుల్లో వ్యత్యాసం కనిపిస్తే ఏం చేయాలన్న దానిపై కూడా కార్యాచరణ ఉండాలని సీఎం పేర్కొన్నారు. థర్డ్‌పార్టీతో స్వతంత్రంగా విచారణ చేయించాలన్న సీఎం గ్రామ సచివాలయాల్లోని వ్యవసాయ అసిస్టెంట్లను పీఏసీఎస్‌ సభ్యులుగా తీసుకురావాలని సిఫార్సు చేశారు. ఈమేరకు చట్ట సవరణకు సీఎం జగన్ అంగీకరించారు. ప్రతీ 3 ఆర్బీకేలకు ఒక పీఏసీఎస్‌ ఉండేలా చూడాలని ప్రతిపాదన రాగా దానికి కూడా సిఎం సానుకూలంగా స్పందించారు.