Site icon NTV Telugu

AP Assembly Budget Session: ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం అనంతరం వాయిదా పడనుంది శాసన సభ. గవర్నర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించాక తొలిసారి నేరుగా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించేందుకు శాసనసభలో అడుగుపెడుతున్నారు. కరోనా కారణంగా 2020, 2021 బడ్జెట్‌ సమావేశాల సమయంలో వర్చువల్‌ విధానంలో మాట్లాడారు. గవర్నర్‌ ప్రసంగం అనంతరం బడ్జెట్‌ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై అసెంబ్లీలో జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయిస్తారు.

https://ntvtelugu.com/somu-veerraju-fired-on-ycp-government/

బీఏసీ సమావేశంలో అసెంబ్లీ షెడ్యూల్‌ ఖరారు చేయనున్నారు. బీఏసీ మీటింగ్ ముగిసిన వెంటనే సచివాలయంలో కేబినెట్‌ భేటీ నిర్వహిస్తారు. శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులపై చర్చించి కేబినెట్ ఆమోదించనుంది. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణతోపాటు పలు అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అకాల మృతికి సంతాపం తెలుపుతూ మంగళవారం ఉభయ సభల్లో తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే మరణించినప్పుడు సంతాపం తెలిపిన తరువాత అనుసరించే సంప్రదాయాన్ని పాటిస్తూ అనంతరం ఉభయ సభలు బుధవారానికి వాయిదా పడతాయి.

అలాగే, ఉదయం 9:30కు చంద్రబాబు నివాసంలో టీడీపీ నేతలు భేటీ కానున్నారు. ప్రభుత్వ విధానాలకు నిరసన తెలుపుతూ అసెంబ్లీ ప్రాంగణానికి వెళ్లనున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. చంద్రబాబు సమావేశాలకు హాజరుకాకూడదని నిర్ణయించిన సంగతి తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది చంద్రబాబు తన నివాసంలో జరిగే సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు.

Exit mobile version