CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్

Babu

Babu

CM Chandrababu: గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలన్న మహాత్మా గాంధీ మాటలను నిజం చేసే దిశగా రాయలసీమలో చారిత్రక కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహకారంతో కరవు సీమను రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌తో పాటు రిలయన్స్ సంస్థ సహకారంతో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన చేశారు. ఐఐఎంలో మేనేజ్‌మెంట్ నిపుణులు, ఐఐటీలో సాంకేతిక నిపుణులు, ఐఎస్‌బీలో పారిశ్రామికవేత్తల నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని, అదే విధంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌లో వ్యవసాయ రంగంలో నాయకులను తయారు చేయాలన్న లక్ష్యం ఉందని చంద్రబాబు వివరించారు. మదనపల్లెలో ఏర్పాటు చేస్తున్న ఈ సంస్థ ఉద్యాన రంగానికి కీలకంగా మారుతుందని, పరిశోధన, సాంకేతికత, ఏఐ ఆధారిత వ్యవసాయ పద్ధతులు రైతులకు అందుబాటులోకి రావాలని రిలయన్స్‌ను కోరుతున్నట్లు చెప్పారు.

గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ద్వారా రాయలసీమను ప్రపంచానికి ఫ్రూట్ బౌల్‌గా తీర్చిదిద్దాలన్నది లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. కేంద్ర సహకారంతో సుమారు రూ.40 వేల కోట్లు, ప్రైవేటు పెట్టుబడుల ద్వారా రూ.60 వేల కోట్ల మేర వ్యయం చేసేలా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఉమ్మడి ప్రకాశం సహా రాయలసీమలోని 10 జిల్లాల్లో 201 క్లస్టర్లు, సుమారు 5,860 గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని, అదనంగా 6 లక్షల హెక్టార్లలో ఉద్యాన సాగును విస్తరించే కార్యక్రమం చేపడుతున్నామని వెల్లడించారు. ప్రస్తుత ప్రణాళికలో 201 క్లస్టర్లు, 303 మండలాలు, 5,869 గ్రామాలు ఉన్నాయి.

ప్రాథమిక రంగం వృద్ధిలో ఉద్యాన రంగానిదే కీలక పాత్ర అని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం సుమారు రూ.1.5 లక్షల కోట్ల మేర జీవీఏ వస్తోందని, గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ద్వారా మరో రూ.లక్ష కోట్ల మేర జీవీఏ పెరుగుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. సాగునీరు అందిస్తే రాయలసీమ రైతులు బంగారం పండిస్తారని, సరైన మార్కెటింగ్ వ్యవస్థ ద్వారా సంపద సృష్టించగలరని పేర్కొన్నారు. యాపిల్ నుంచి స్ట్రాబెర్రీ వరకు, అరటి నుంచి ఆవకాడో వరకు, కివీ నుంచి డేట్స్ వరకు వివిధ రకాల పంటలను సాగు చేసే అవకాశాలను పెంచుతామని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్‌చెయిన్, ప్యాకింగ్, ఎగుమతుల ద్వారా రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. పంటల స్థిరీకరణతో పాటు ధరల స్థిరీకరణకు హార్టికల్చర్ హబ్ ఉపయోగపడుతుందని అన్నారు. ఉద్యాన సాగు విస్తరణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతులను అనుసంధానం చేయడం ద్వారా రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించాలన్నది ప్రణాళికగా ఉందని వివరించారు.

రాయలసీమలో నీటి కొరత, తక్కువ వర్షపాతం కారణంగా గతంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని చంద్రబాబు గుర్తుచేశారు. దేశంలోనే తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో అనంతపురం ఒకటని, ఎడారిలాంటి పరిస్థితులు ఉండేవని అన్నారు. ఎన్టీఆర్ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తూ హంద్రీనీవా, గాలేరు-నగరి వంటి ప్రాజెక్టుల ద్వారా సీమకు నీటిని అందిస్తున్నామని చెప్పారు. డ్రిప్ ఇరిగేషన్ వంటి సాంకేతికతను అందించడంతో పాటు జల సంరక్షణ చర్యల ద్వారా భూగర్భజలాలను పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హంద్రీనీవా కాలువకు రూ.3,500 కోట్లు ఖర్చు చేసి పూర్తి చేసి కుప్పం వరకు నీటిని తీసుకెళ్లామని చంద్రబాబు అన్నారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి మార్కాపురానికి, పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి వరకు నీటిని అందించే దిశగా చర్యలు చేపట్టామని చెప్పారు. రాయలసీమలో హంద్రీనీవా, మడకశిర బ్రాంచ్ కెనాల్, మల్లెమడుగు, బాలాజీసాగర్, అప్పర్ పేరూరు వంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని వెల్లడించారు. రూ.35 వేల కోట్లతో 36 ప్రాధాన్యతా ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు.

తన ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో తనను హైటెక్ సీఎం, సీఈఓ సీఎం అని పిలిచారని, ఇప్పుడు వాటర్‌మ్యాన్‌గా గుర్తించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చంద్రబాబు అన్నారు. ఎల్‌నినో వంటి పరిస్థితులు, వాతావరణ మార్పులతో నీటి సమస్యలు మరింత క్లిష్టమవుతున్నాయని పేర్కొన్నారు. ఈసారి గోదావరిలో కూడా సుమారు 1,600 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లిందని, నదుల అనుసంధానం ద్వారా ఆ నీటిని వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పట్టిసీమ ద్వారా పదేళ్లలో సుమారు 500 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తీసుకువచ్చామని, అక్కడ పొదుపు చేసిన కృష్ణా నీటిని రాయలసీమకు తరలించామని చంద్రబాబు చెప్పారు. నదుల అనుసంధానం వల్లే ఇది సాధ్యమైందన్నారు. పట్టిసీమ నిర్మాణ సమయంలో ప్రతిపక్షం నుంచి వ్యతిరేకత ఎదురైందని, అప్పట్లో ప్రాజెక్టును పూర్తి చేయకపోయి ఉంటే రాయలసీమ పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించాలన్నారు. వచ్చే ఏడాది పోలవరం పూర్తి చేసి ప్రధాని మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని తెలిపారు.

దేశంలో పవర్ గ్రిడ్, రోడ్ గ్రిడ్, డిజిటల్ కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చాయని, ఇక వాటర్ గ్రిడ్ అవసరముందని చంద్రబాబు అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా నదుల అనుసంధానం, నీటి వనరుల సమన్వయంపై ఆలోచించారని గుర్తుచేశారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య నీటి వివాదాల కారణంగా సమయం వృథా అవుతోందని, గోదావరి నుంచి కావేరి వరకు నీటిని తీసుకెళ్లే ప్రతిపాదనను కేంద్ర మంత్రికి వివరించానని చెప్పారు. దీనివల్ల నాలుగు రాష్ట్రాల నీటి సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంటుందని, నీటి వివాదాలకు బదులుగా అభివృద్ధిపై దృష్టి పెట్టే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై కూడా చంద్రబాబు ప్రశంసలు చేశారు. ఇంటిని ఎలా నడపాలో మహిళలకే తెలుసని, భారతదేశానికి ఆర్థిక మంత్రిగా ఆమె దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా పనిచేస్తున్నారని అన్నారు. జీఎస్టీ నెక్స్‌ట్‌జెన్ సంస్కరణలు, ఎన్‌పీఏలు, డీబీటీలో లీకేజీలు లేకుండా తీసుకున్న చర్యలను ప్రస్తావించారు. దేశంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు అందిస్తూ దేశ నిర్మాణంలో నిర్మలా సీతారామన్ కీలకంగా వ్యవహరిస్తున్నారని, అమరావతి, విశాఖ ఉక్కు, పోలవరం వంటి ప్రాజెక్టులకు కేంద్రం సహకరిస్తోందని తెలిపారు.

రిలయన్స్ సంస్థ, అనంత్ అంబానీ చేస్తున్న సేవలను కూడా చంద్రబాబు ప్రస్తావించారు. వంతారా ద్వారా జంతు సంరక్షణలో అనంత్ అంబానీ సేవలు అందిస్తున్నారని, తిరుమల శ్రీవారిపై భక్తితో ఈవీ బస్సులను కూడా సమకూర్చారని పేర్కొన్నారు. రైతులకు విత్తనం నుంచి ఎగుమతి వరకు మద్దతు అందించేందుకు ‘సీడ్ టు షిప్‌మెంట్’ విధానం, అగ్రిటెక్, లాజిస్టిక్స్, అగ్రి ఇన్‌ఫ్రా వంటి వ్యవస్థలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతులకు పూర్తి స్థాయి మద్దతు లభిస్తుందని చంద్రబాబు ఆకాంక్షించారు. వ్యవసాయం, ఉద్యాన రంగంతో పాటు ఇతర అనుబంధ రంగాల్లో పరిశోధనలు పెంచాలని, కృత్రిమ మేధస్సు (AI) వంటి ఆధునిక సాంకేతికతను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని రిలయన్స్ సంస్థను కోరారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ద్వారా రాయలసీమ రైతుల ఆదాయం, మార్కెట్ అవకాశాలు, ప్రాసెసింగ్, ఎగుమతులు పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..