ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ మరో వర్ష సూచన ఉంది అని తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం మరియు ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రంలో బలపడిన అల్పపీడనం… రాగల 12 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి వాయుగుండంగా మారనుంది అని ప్రకటించింది. ఆ తదుపరి 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉంది. అది శనివారం ఉదయం నాటికి ఉత్తరాంధ్ర – ఒడిశా తీరాలకు చేరుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో శుక్రవారం ఉత్తరాంధ్రలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. శనివారం ఉత్తరాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అయితే రేపు అర్ధరాత్రి నుంచి తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ, ఎల్లుండి ఉదయం నుంచి 70-90 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయి. అందువల్ల మత్య్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్ళరాదు అని ఆదేశాలు ఇచ్చింది. భారీ వర్షాల నేపధ్యంలో లోతట్టు ప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పొంగి ప్రవహించే కాలువలు, ప్రవాహాలు, ఇతర నీటిపారుదల మార్గాలు తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు పేర్కొన్నారు.
