Andhra Pradesh Liquor Licence: ఆంధ్రప్రదేశ్‌లో బార్ల లైసెన్సులకు బిడ్డింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. జోన్-1, జోన్-4లలో అధికారులు బిడ్లను తెరవగా… రాయలసీమలో భారీ మొత్తాలకు బిడ్లు దాఖలయ్యాయి. కడపలోని ఓ బార్ కోసం రూ. 1.71 కోట్లకు అత్యధిక బిడ్ దాఖలైంది. ఈ బిడ్ వైసీపీ నేత దాఖలు చేశారంటూ ప్రచారం జరుగుతోంది. తిరుపతిలో రూ. 1.59 కోట్లకు బిడ్ దాఖలు కాగా.. అనంతపురంలో రూ.1.09 కోట్లతో బిడ్ దాఖలైంది. ప్రొద్దుటూరులో రూ.1.31 కోట్లకు ఓ వ్యక్తి బిడ్ దాఖలు చేశాడు. అయితే రాయలసీమలో పరిస్థితి ఇలా ఉండగా.. ఉత్తరాంధ్రలో మరోలా ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో తక్కువ మొత్తాలకు బిడ్లు దాఖలయ్యాయి. విశాఖ నగరంలో రూ. 60 లక్షలకు మాత్రమే అత్యధికంగా బిడ్ దాఖలైంది. ప్రస్తుతం బార్ లైసెన్సులకు రీ-బిడ్డింగ్, లాటరీ ప్రక్రియ కొనసాగుతోంది. రాయలసీమ జిల్లాల్లో మెజార్టీ బార్లకు రీ-బిడ్డింగ్ జరుగుతోంది.
Read Also: Chikoti Praveen: క్యాసినో కేసులో వేగం పెంచిన ఈడీ.. ప్రవీణ్ సహా ఐదుగురికి నోటీసులు
కాగా సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్లు అమలులోకి వచ్చేలా ఇ–వేలం నిర్వహణ జరుగుతోంది. లైసెన్స్ కాలపరిమితి మూడేళ్ల పాటు ఉంటుంది. ఇ–వేలంలో ఒకరికంటే ఎక్కువ మంది ఒకే మొత్తాన్ని కోట్ చేస్తే లాటరీ విధానంలో లైసెన్స్ కేటాయిస్తారు. వేలంలో లైసెన్స్ పొందినవారు అనంతరం ఒక రోజులో నిర్దేశిత మొత్తాన్ని చెల్లించాలి. లేదంటే ఆ కేటాయింపును రద్దు చేసి మళ్లీ ఇ–వేలం నిర్వహిస్తారు. లైసెన్సులు పొందినవారు తమకు కేటాయించిన మున్సిపల్ కార్పొరేషన్/ మున్సిపాలిటీ పరిధిలో నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రమాణాల ప్రకారం బార్లు ఏర్పాటు చేసుకోవాలి.