ఏపీలో గోదావరి నది పోటెత్తుతుండటంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో చాలా గ్రామాలు నీటి మునిగాయి. ఇప్పటికీ పలు గ్రామాలు నీటి ముంపులోనే ఉండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి వరద సహాయ, పునరావాస వ్యయం కింద జిల్లా కలెక్టర్లకు అదనపు నిధులు విడుదల చేసింది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, డా.బీ.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు రూ.5 కోట్ల నిధులు కేటాయించింది. ఇందులో ఉభయగోదావరి జిల్లాలకు చెరో 2 కోట్లు ఖర్చు చేసుకునే అవకాశం ఉంది. పునరావాస కేంద్రాల్లో ఉండే వరద బాధితులు ఇళ్లకు వెళ్ళే సమయంలో ఆర్ధిక సహాయం కింద రూ.వెయ్యి ఇవ్వనున్నారు. వరద బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లకు నిధుల విషయంలో ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also: World Emoji Day: ఎమోజీ అంటే ఏంటి? వాటిని ఎందుకు వాడతాం?
కాగా గోదావరి వరద ఉధృతి కారణంగా యానాం ప్రజలు వణికిపోతున్నారు. తొలిసారి యానాం పట్టణం చుట్టూ వరదనీరు చేరింది. దీంతో కట్టుబట్టలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలివెళ్తున్నారు. అయితే అక్కడ కనీస సౌకర్యాలు లేక ఆకలితో అవస్థలు పడుతున్నారు. చిన్నపిల్లలకు పాలు కూడా దొరకడం లేదని ఆందోళన చెందుతున్నారు. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే యానాంలోని పలు ప్రాంతాల్లో ఫస్ట్ ఫ్లోర్లలోకి కూడా వరద నీరు వెళ్లే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
