Site icon NTV Telugu

YS Jagan Mohan Reddy: ఈ ఒక్క ఎన్నికల్లో గెలిస్తే… 30 ఏళ్ల పాటు మనమే ఉంటాం..!

Ys Jagan Mohan Reddy

Ys Jagan Mohan Reddy

ఈ ఒక్క ఎన్నికల్లో మనం గెలిస్తే… ఆ తర్వాత 30 ఏళ్ల పాటు మనమే అధికారంలో ఉంటామనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. వరుసగా వివిధ నియోజకవర్గాల నేతలతో సమావేశం అవుతూ.. అక్కడి పరిస్థితులు, ప్రభుత్వం అందించిన పథకాలు, చేయాల్సిన పనులపై దిశానిర్దేశం చేస్తూ వస్తున్న ఆయన.. ఇవాళ విశాఖ ఉత్తర నియోజకవర్గ కార్యకర్తలతో క్యాంపు కార్యాలయంలో సమావేశం అయ్యారు.. సమావేశంలో పాల్గొన్న ప్రతి కార్యకర్తతో విడివిడిగా మాట్లాడిన సీఎం.. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని గణాంకాలతో సహా వారి ముందు పెట్టారు.. మరో 16 నెలల్లో ఎన్నికలు రానున్నాయి.. దానికి సన్నద్ధం కావల్సి ఉంది.. మనం గడప గడపకూ కార్యక్రమంలో ప్రభుత్వాన్ని ప్రతి వార్డులోకి, ప్రతి ఇంటి దగ్గరకి తీసుకెళ్తున్నాం.. ఇందులో మీ అందరి భాగస్వామ్యం ఎంతో అవసరం.. ఇంత పారదర్శకంగా పథకాలు గతంలో ఏ రోజూ సామాన్యుడి దగ్గరకి పోలేదు.. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో తొలిసారి ఇలా జరుగుతుందన్నారు జగన్.

Read Also: YS Jagan Government: జగన్‌కు దెబ్బకొట్టేందుకు బీజేపీ కుట్ర.. మరోసారి ఆ ప్రస్తావన తెచ్చిన కేసీఆర్

వివక్షకు ఏమాత్రం తావులేకుండా, లంచాలకు ఆస్కారం లేకుండా పాలన సాగుతోందన్నారు ఏపీ సీఎం.. ఎన్నికల మేనిఫెస్టో హామీల్లో 98 శాతం పైన నెరవేర్చాం అన్నారు. ఇప్పుడు ప్రజలకు దగ్గరకు వెళ్లి వాళ్ల ఆశీస్సులు కోరుతున్నాం.. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 175 కు 175 నియోజకవర్గాలు ఎందుకు రాకూడదు అనే లక్ష్యంతో అడుగులు ముందుకు వేయాల్సి ఉంది.. 175కు 175 మనం అనుకున్న లక్ష్యం కచ్చితంగా సాధ్యమవుతుందన్నారు. ఇక, కుప్పంలాంటి నియోజకవర్గంలో కూడా క్లీన్‌ స్వీప్‌ చేశామని మరోసారి గుర్తుచేశారు సీఎం జగన్.. మున్సిపాల్టీ, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్ధానాలు కూడా అన్నీ అలానే గెల్చుకున్నాం.. గతంలో రాని ఫలితాలు ఇవాళ చూస్తున్నాం.. గ్రామాల్లో మారుతున్న బడులు, ఆసుపత్రులు, ఆర్బీకేలు, పట్టణాల్లో అర్భన్‌ హెల్త్‌ క్లినిక్స్‌ కనిపిస్తున్నాయి… రాబోయో రోజుల్లో డిజిటల్‌ లైబ్రరీలు కూడా రానున్నాయన్నారు. విశాఖపట్నం రాష్ట్రంలో అన్నిటికన్నా పెద్ద నగరం.. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కూడా 76 శాతం ఇళ్లల్లో మన పథకాలు కనిపిస్తున్నాయి. దాదాపు 1.05 లక్షల ఇళ్లు ఉంటే దాదాపు 80 వేల ఇళ్లకు పథకాలు అందాయి.. క్యాలెండర్‌ ప్రకారం నెల, నెలా బటన్‌ నొక్కడం నేను చేయాలి.. ఈ నెలలో ఈ పథకం ఇస్తామని మొట్ట మొదటి సారిగా బడ్జెట్‌ అన్నదానికి నిర్వచనం మార్చాం.. గతంలో ఇలా ఎప్పుడూ క్యాలెండర్‌ ప్రకారం జరగలేదని విమర్శించారు.

నేను చేయాల్సిన పని నేను చేయాలి.. మీరు చేయాల్సింది మీరు చేయాలి.. ఈ రెండింటి కాంబినేషన్‌ జరిగితే 175 కి 175 వై నాట్‌ ? అని ప్రశ్నించారు సీఎం జగన్.. మీరు కచ్చితంగా ప్రతిగడపకూ వెళ్లాలి.. ఆ ఇంట్లో అక్క, చెల్లెమ్మ పేరుతో జరిగిన మంచిని వారికి వివరిస్తూ… గుర్తు చేస్తూ… ప్రజల ఆశీస్సులు కూడా తీసుకోవాలని.. అంతే కాకుండా ఆ వార్డులో జన్యూన్‌ కారణాలతో ఎవరైనా మిస్‌ అయితే… వాటిని కూడా పరిష్కరించాలని.. చిన్న చిన్న సమస్యలు ఉంటే మనం దగ్గరుండి పరిష్కరించి వాటిని లేకుండా చేయాలని ఆదేశించారు. అందరూ కలిసి ఒక లక్ష్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.. ఈ ఒక్క ఎన్నికల్లో మనం గెలిస్తే… ఆ తర్వాత 30 ఏళ్ల పాటు మనమే అధికారంలో ఉంటామనే నమ్మకాన్ని వ్యక్తం చేసిన ఆయన.. ఎలాంటి విభేదాలున్నా వాటిని పక్కనపెట్టి అందరూ కలిసికట్టుగా అడుగులు వేయాలని స్పష్టం చేశారు.. మనం నలుగురికి మంచి చేయాలంటే.. మనం అధికారంలో ఉంటేనే చేయగలుగుతాం.. ఇవాళ వ్యవస్ధలో గొప్ప మార్పులు జరుగుతున్నాయి. అవి కొనసాగాలంటే మనందరం కలిసికట్టుగా అడుగులు వేయాలని దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.

Exit mobile version