Site icon NTV Telugu

CM YS Jagan Mohan Reddy: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

Ys Jagan Mohan Reddy

Ys Jagan Mohan Reddy

జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి.. ఈ సందర్భంగా.. వివిధ అంశాలపై కీలక సూచనలు చేశారు.. ఉపాధిహామీ పనుల సగటు వేతనం రూ.240 ఉండేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్న ఆయన.. పూర్తి కాని ఆర్బీకేలు, సచివాలయాలు, హెల్త్‌ క్లినిక్స్‌ను అక్టోబర్‌ నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. 3,966 గ్రామాల్లో డిజిటల్‌ లైబ్రరీలు డిసెంబరు నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేసిన ఆయన.. ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల నిర్వహణపై సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండాలన్నారు.. ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక ఫోన్‌ నంబర్లతో బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు.. అక్టోబర్‌ 2 నాటికి వేల గ్రామాల్లో జగనన్న భూహక్కు మరియు భూ రక్షసర్వే పూర్తి కావాలని.. సంబంధిత వ్యక్తుల చేతిలో జగనన్న భూ రక్ష హక్కు పత్రాలు ఇవ్వాలని.. అక్టోబరు తర్వాత ప్రతి నెలలోనూ వేయి గ్రామాల్లో సర్వే పూర్తి చేసి పత్రాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

Read Also: CM YS Jagan Live : Spandana Video Conference

గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ స్పందన కార్యక్రమం కచ్చితంగా జరగాలని స్పష్టం చేశారు సీఎం జగన్.. ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, సబ్‌ డివిజన్, మండల స్థాయిల్లో కచ్చితంగా స్పందన జరగాలన్న ఆయన.. సంబంధిత అధికారులు కచ్చితంగా స్పందనలో పాల్గొనాలన్నారు.. ప్రతి బుధవారం .. స్పందన వినతులపై కలెక్టర్లు సమీక్ష చేయాలని, ప్రతి గురువారం చీఫ్‌సెక్రటరీ జిల్లా కలెక్టర్లతో స్పందన పై సమీక్ష చేయాలని.. అదే సమయంలో ఎస్‌డీజీ లక్ష్యాలపైనా రివ్యూ చేయాలని ఆదేశించారు. ఇక, గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో నేరుగా ప్రజల వద్దకు ఎమ్మెల్యే, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు వెళ్తున్నారు.. ప్రజల నుంచి వచ్చిన వినతుల ఆధారంగా అందులో ప్రాధాన్యతా పనులుగా గుర్తించి వాటి పైన ఒక విజ్ఞప్తిని సంబంధిత ఎమ్మెల్యే పంపిస్తున్నారు.. ఈ ప్రాధాన్యతా పనులను పూర్తి చేయడానికి ఒక్కో సచివాలయానికి రూ.20లక్షల రూపాయలను కేటాయించామని వెల్లడించారు. ఈ పనులు చేపట్టేలా, యద్ధ ప్రాతిపదికిన వాటిని పూర్తిచేసేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని.. వేగంగా పనులు చేపట్టడమే కాదు, వాటిని అంతే వేగంతో పూర్తి చేయాలన్నారు.

ఇక, దాదాపు 15వేల సచివాలయాలకు ప్రాధాన్యతా పనులకోసం రూ.3వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని వెల్లడించారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్.. మరోవైపు, వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్‌ టాప్‌లో నిలవడంపై సంతోషం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి.. 2021–22లో ఏపీ స్థూల ఉత్పత్తి వృద్ధిరేటు 11.43 శాతంగా నిలవడం సంతోషకరమన్న ఆయన.. దేశ వృద్ధిరేటు కంటే అధికంగా ఉంది.. పారదర్శక విధానాలే ఈ వృద్ధికి మూలకారణమని భావిస్తున్నాం అన్నారు. త్వరలో అమలు చేయనున్న సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతూ.. ఈనెల 25న అంటే ఎల్లుండి నేతన్న నేస్తం, వచ్చేనెల 22న వైయస్సార్‌ చేయూత కార్యక్రమం ఉంటుందని.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రకటించారు ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.

Exit mobile version