Site icon NTV Telugu

Kethireddy Peddareddy vs JC Prabhakar Reddy: జేసీ సవాల్‌ను స్వీకరిస్తున్నా.. నేను చర్చకు రెడీ.. డేట్‌ ఫిక్స్‌ చేయండి..!

Kethireddy Vs Jc Prabhakr

Kethireddy Vs Jc Prabhakr

Kethireddy Peddareddy vs JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎప్పుడూ ఏదో పొలిటికల్‌ హీట్‌ కొనసాగుతూనే ఉంటుంది.. గతంలో కేతిరెడ్డి వర్సెస్‌ జేసీ అయితే.. ఇప్పుడు జేసీ వర్సెస్‌ కేతిరెడ్డి అన్నట్టుగా.. వ్యవహారం మారిపోయింది.. అయితే, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ పౌరుషంపై జేసీ ప్రభాకర్‌ రెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నానని, తాను ఎలాంటి చర్చకైనా సిద్ధమని స్పష్టం చేశారు. చర్చకు సంబంధించి డేట్‌ను ఫిక్స్‌ చేయాలని, కలెక్టర్‌, ఎస్పీలకు సమాచారం ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్‌ రెడ్డి 30 ఏళ్ల పాలనకు, తన ఐదేళ్ల పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమని కేతిరెడ్డి ప్రకటించారు. రాయలసీమ జిల్లాల్లో ఎక్కడైనా చర్చ జరిపేందుకు తాము సిద్ధమేనని, అవసరమైన అనుమతులు మీరు ఇప్పిస్తే చాలని అన్నారు. చర్చకు తమ కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతారని స్పష్టం చేశారు.

Read Also: CM Revanth Reddy: అందుకే నెలకు మూడు సార్లు కేంద్రం, మోడీని కలుస్తున్నా.. సీఎం కీలక వ్యాఖ్యలు..

ఇక, పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై కేతిరెడ్డి విమర్శలు గుప్పించారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై తాను చేసిన వ్యాఖ్యలపై జేసీ విమర్శించడం హాస్యాస్పదమని అన్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేతల అక్రమాలపై రెండు సార్లు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా విచారణ జరగడం లేదని ఆరోపించారు. విచారణ జరగకుండా జేసీ ప్రభాకర్‌ రెడ్డి అడ్డుపడుతున్నారని, సాక్షాత్తూ జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే అయిన తనను కూడా తాడిపత్రిలో తిరగకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ పౌరుషం ఏంటో చూపించాలంటే అటు జేసీ కుటుంబ సభ్యులు, ఇటు తమ కుటుంబ సభ్యులు తేల్చుకుందామని సవాల్‌ విసిరారు. జేసీ ప్రభాకర్‌ రెడ్డికి తాను భయపడడం లేదని కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలతో అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Exit mobile version