Teacher Dies During Election Duty: ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతోన్న సమయంలో విషాదం నెలకొంది.. ఎన్నికల విధులు నిర్వహిస్తుండగా ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ విధుల్లో ఉన్న ఎస్జీటీ ఉపాధ్యాయురాలు హరిత గౌడ్ (58) తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు. కూడేరు మండలం కాడదారకుంట గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో గురువారం ఈ ఘటన జరిగింది. హరిత గౌడ్ ప్రస్తుతం అనంతపురం జిల్లా డి.హీరేహాల్ మండలం పరిధిలోని పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా ఆమెకు ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం కాడదారకుంట పోలింగ్ కేంద్రంలో అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ (ఏపీఓ)గా బాధ్యతలు అప్పగించారు. దీంతో గురువారం ఉదయం ఆమె పోలింగ్ విధులకు హాజరయ్యారు.
ఈ క్రమంలో పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. బీపీ, షుగర్ స్థాయిలు తగ్గడంతో పాటు శ్వాస సంబంధిత సమస్య తలెత్తినట్లు సమాచారం. వెంటనే అక్కడ అందుబాటులో ఉన్న వైద్య బృందం ఆమెకు ప్రాథమిక చికిత్స అందించి కూడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. అక్కడ వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. గురువారం మధ్యాహ్నం 12.50 గంటలకు ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. హరిత గౌడ్ స్వస్థలం గుంతకల్లు పట్టణమని తెలిసింది. ఆమె మృతి వార్తతో సహచర ఉపాధ్యాయులు, ఎన్నికల సిబ్బందిలో విషాదం నెలకొంది. ఎన్నికల విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది.
హరిత మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
ఎన్నికల విధుల్లో ఉండగా పోలింగ్ అధికారి హరిత గౌడ్ మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విధులు నిర్వహిస్తున్న సమయంలో అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. హరిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
హరిత కుటుంబానికి అన్ని ప్రయోజనాలు అందించాలి: పవన్
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యా్ణ్ సైతం హరిత గౌడ్ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆమె గుండెపోటుతో మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. హరిత ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని ప్రయోజనాలను ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
నివాళులర్పించిన మంత్రి నారా లోకేష్
మంత్రి నారా లోకేష్ కూడా హరిత గౌడ్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నికల విధుల్లో భాగంగా ఏపీఓగా పనిచేస్తున్న ఆమె గుండెపోటుతో కన్నుమూయడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. అస్వస్థతకు గురైన వెంటనే అత్యవసర వైద్యం అందించినప్పటికీ ఆమెను కాపాడలేకపోవడం విచారకరమన్నారు. హరితకు నివాళులర్పిస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అయితే, ఎన్నికల విధుల నిర్వహణలో ఉండగానే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

