Anakapalli Tensions: అనకాపల్లి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్కు కోసం ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం రసాభాసగా మారింది. భారీ బందోబస్తు, ముందస్తు అరెస్టులతో వాతావరణం వేడెక్కింది. నక్కపల్లి మండలంలో ఏర్పాటు చేయనున్న బల్క్ డ్రగ్ పార్కుకు సంబంధించి రెండో విడత ప్రజాభిప్రాయ సేకరణను పీసీబీ ప్రారంభించింది. బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు మొత్తం 1,514 ఎకరాలు అవసరమని అధికారులు గుర్తించారు. ఇందులో 700 ఎకరాలకు సంబంధించి రెండున్నరేళ్ల కిందట మొదటి విడత ప్రజాభిప్రాయసేకరణ జరిగింది.
Read Also: Intelligence Alert: దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులలో హై అలర్ట్.. భద్రతకు ముప్పు!
అయితే, బల్క్ డ్రగ్ పార్కుకు మరో 814 ఎకరాలకు సంబంధించి ఇప్పుడు రెండో విడత ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించేందుకు ఏపీఐఐసీ, పర్యావరణం, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ భూములు సీహెచ్‌ఎల్ పురం, పెదతీనార్ల, ఎన్.నర్సాపురం, ఉపమాక, ఎస్.రాయవరం మండలం గుడివాడ గ్రామాల పరిధిలో ఉన్నాయి. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, నిర్వాసితులకు సంబంధించి 15 నుంచి 20 మంది తమ అభిప్రాయాలను చెప్పేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. అయితే, బల్క్ డ్రగ్ పార్కుకు తమ భూములు ఇచ్చేది లేదంటూ ఆయా గ్రామాల రైతులు, మత్స్యకారులు కొద్ది రోజుల నుంచి సీపీఎం, వైసీపీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళలు చేస్తున్నాయి.
