Site icon NTV Telugu

Gudivada Amarnath: వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది.. ఇన్వెస్టర్స్ భయపడే పరిస్థితి ఉంది..

Gudivada Amarnath

Gudivada Amarnath

Gudivada Amarnath: మరోసారి కూటమి సర్కార్‌పై విమర్శలకు దిగారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత గుడివాడ అమర్నాథ్‌.. విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్‌కు తీవ్ర భంగం కలుగుతోందన్న విమర్శలు ఊపందుకుంటున్నాయి. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ఎమ్మెల్యేలు, అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు భూ కబ్జాలు, భూ వివాదాల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాలు పెట్టుబడుల కోసం ముందుకొచ్చే ఇన్వెస్టర్లను భయపెడుతున్నాయని రాజకీయ వర్గాలు, పారిశ్రామిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేశారు అమర్నాథ్..

Read Also: Cash-for-Query Case: ఢిల్లీ హైకోర్టులో మహువా మొయిత్రాకి బిగ్ రిలీఫ్..

ప్రత్యేకంగా భూ వివాదాలు, సివిల్ సెటిల్‌మెంట్ల విషయంలో ఎమ్మెల్యేల జోక్యం పెరుగుతుండటంతో పాలనా యంత్రాంగం చేతకాని స్థితిలో పడిపోయిందన్నారు అమర్నాథ్.. ప్రభుత్వం ఎమ్మెల్యేలను కట్టడి చేయలేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ఆరోపించారు. కలెక్టర్లు, ఎస్పీలను పిలిపించి క్లాస్ పీకడం వల్ల ప్రయోజనం ఉండదని, అసలు సమస్యకు మూలమైన ఎమ్మెల్యేలపైనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.. సామంత రాజుల్లా వ్యవహరిస్తున్న ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకుంటేనే పరిస్థితి అదుపులోకి వస్తుందని అంటున్నారు.

విశాఖను అంతర్జాతీయ పెట్టుబడి కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి ఈ భూ కబ్జాలు, అక్రమ జోక్యాలు పెద్ద అడ్డంకిగా మారుతున్నాయని విమర్శించారు గుడివాడ.. పెట్టుబడులు పెట్టాలనుకునే ఇన్వెస్టర్లు భూ భద్రత, చట్టపరమైన స్థిరత్వంపై సందేహాలు వ్యక్తం చేస్తూ వెనకడుగు వేస్తున్నారనే సమాచారం కూడా బయటకు వస్తోందన్నారు.. ఈ నేపథ్యంలో ముందుగా ఎమ్మెల్యేలను కట్టడి చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు.. ప్రజాప్రతినిధులు చట్టానికి లోబడి వ్యవహరించేలా కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడే విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడుకోవడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్..

Exit mobile version