Anakapalli: తీవ్ర వాయుగుండం తీరం దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.. భారీ వర్షాల నేపథ్యంలో అనకాపల్లి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నాతవరం మండల కేంద్రంలోని గొల్లవీధిలో విద్యుత్ షాక్‌కు గురై తల్లీకూతుళ్లు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వర్షాల కారణంగా విద్యుత్ లైన్‌కు సంబంధించిన సపోర్టు తీగ ఇంటిపై పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. తెల్లవారుజామున బాత్రూమ్‌కు వెళ్తున్న సమయంలో కుమార్తె జానకి (28) విద్యుత్ వైరు తగలడంతో షాక్‌కు గురై కేకలు వేసింది. ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన తల్లి మంగ (55) కూడా విద్యుత్ షాక్‌కు గురయ్యారు. దీంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
తల్లీకూతుళ్లను రక్షించే క్రమంలో జానకి భర్త నాగరాజు (32) కూడా విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ఆయన చెక్కతో విద్యుత్ వైర్‌ను తప్పించే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి విద్యుత్ అధికారులకు సమాచారం అందించడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. తీవ్రంగా గాయపడిన నాగరాజును స్థానికులు నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో నాతవరం గొల్లవీధిలో విషాదం నెలకొంది. వర్షాల సమయంలో విద్యుత్ వైర్లు, స్తంభాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

