ఏపీలో అమ్మ ఒడి పథకం మూడో విడత నిధుల పంపిణీకి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ మేరకు ఈనెల 27న అమ్మఒడి పథకం నిధుల ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ నెల 27న శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్ 2022-23 ఆర్ధిక సంవత్సరానికి అమ్మఒడి పథకం నిధులను విడుదల చేయనున్నారు. ఈ నెల 23 తేదీన చేపట్టాల్సిన ఈ కార్యక్రమాన్ని వివిధ కారణాల వల్ల ప్రభుత్వం వాయిదా వేసింది. అమ్మ ఒడి పథకం కింద లబ్ధిదారుల ఖాతాలో ఈ ఏడాది రూ. 13 వేలను ప్రభుత్వం జమ చేయనుంది. రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకు ప్రతి ఏటా రూ.15 వేల చొప్పున వారి తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేస్తోంది. ఇప్పటికే రెండేళ్ల పాటు లక్షలాది మందికి ఈ పథకాన్ని ప్రభుత్వం అందజేసింది.
2022-23 ఆర్ధిక సంవత్సరానికి రూ .6,500 కోట్ల మేర నిధులను ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయింపులు చేసింది. 2021-22లోనూ రూ. 6,107 కోట్లను బడ్జెట్‌లో పెట్టినా అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వం అమలు చేయలేదు. ఈ ఏడాది అమ్మ ఒడి పథకం లబ్దిదారుల సంఖ్యలో వివిధ కారణాలతో లక్ష మందికి కోత పడినట్లు తెలుస్తోంది. పాఠశాలలకు గైర్హాజరు కావటంతో 51 వేల మందికి అమ్మఒడి పథకానికి అనర్హులుగా ప్రభుత్వం తేల్చింది. మిగతా 50 వేల మంది పైచిలుకు విద్యార్ధులకు వేర్వేరు కారణాలతో పథకం నిలిపివేయనున్నారు. అయితే 2019-20 ఆర్ధిక సంవత్సరానికి రూ. 6301 కోట్లను అమ్మఒడి పథకం కింద ప్రభుత్వం అందించడం గమనార్హం. కాగా శ్రీకాకుళం జిల్లా పర్యటనలో సీఎం జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. శ్రీకాకుళం-ఆముదాల వలస నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ పనులకు సీఎం జగన్ భూమి పూజ చేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించి అమ్మ ఒడి నిధులను విడుదల చేయనున్నారు.
Andhra Pradesh: సీఎం జగన్‌ను సన్మానించిన 1998 డీఎస్సీ అభ్యర్థులు