ONGC Oil Leak Row: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలోని పాశర్లపూడి దగ్గర ఓఎన్‌జీసీ డ్రిల్లింగ్ సైట్ ఎదుట ఆయిల్ లీకేజ్ పై వివాదం చెలరేగింది. ఈ ఘటనపై మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవమని ఓఎన్‌జీసీ అధికారులు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అయితే, ఆయిల్ లీకేజ్ నియంత్రణ కోసం రాజమండ్రి నుంచి ప్రత్యేకంగా పైప్ లైన్ టీమ్ చేరుకోవడంతో వారిని స్థానిక ప్రజలు అడ్డుకున్నారు.
ఒకవైపు “ఆయిల్ లీకేజీ లేదని” ప్రెస్ మీట్ నిర్వహించిన అధికారులు, మరోవైపు లీకేజీని కంట్రోల్ చేయడానికి బృందాన్ని పంపడం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో వారు పైప్ లైన్ టీమ్‌ను గ్రామంలోకి అడుగు పెట్టనివ్వలేదు. ఓఎన్‌జీసీ కార్యకలాపాల వల్ల తమ పంటలు పండకపోవడం, బిల్డింగులకు బీటలు వారడం, తాగడానికి మంచినీరు దొరకకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై సమాధానం చెప్పకుండా తప్పుడు ప్రెస్ నోట్లు విడుదల చేసి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
