Jagganna Thota Prabhala Theertham: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో మకర సంక్రాంతి సందర్భంగా ప్రభల ఉత్సవం కన్నుల పండువగా సాగింది.. రాష్ట్ర నలుమూలల నుండి లక్షలాది ప్రజలు ప్రభల ఉత్సవాన్ని చూసేందుకు తరలివచ్చారు.. ఈ నేపథ్యంలో అధికారులు ఉత్సవ కమిటీలు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేటప్పుడు ప్రభల ఉత్సవం జరపడం కొత్తపేటలో ఆనవాయితీగా వస్తుంది. ప్రభల ఉత్సవాలు మూడు ప్రధాన వీధుల మధ్య పోటాపోటీగా జరుగుతుంది. ముందుగా పాత రామాలయం మనసేబు గారి ప్రభ వీరభద్రుని అలంకరించుకొని పురవీధుల్లోకి వచ్చి.. మిగిలిన ప్రభలు పురవీధుల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య ఊరేగింపుగా బయలుదేరాయి.. మంగళవారం ఉదయం పాత రామాలయం, కొత్త రామాలయం, బోడిపాలెం వీదుల ప్రభల ఊరేగింపు కొత్తపేట ప్రధాన పురవీధుల్లో సాగింది. ఈ మూడు ప్రధాన వీధుల ప్రభలను అనుసరిస్తూ చిన్న ప్రభలను ఊరేగించారు. ప్రభల ముందు సంగీత నాదస్వర మేళాలు, డప్పు వాయిద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు బాణా సంచా కాల్పుల నడుమ ఊరేగింపు ముందుకు సాగింది. కొత్తపేట ప్రభల ఉత్సవాలు మాత్రం మకర సంక్రాంతి రోజునే నిర్వహించడం ఆనవాయితీ. సుమారు 500 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రభల ఉత్సవాలు నిర్వహిస్తున్నారని పెద్దలు చెబుతుంటారు. ఇక, నేడు కనుమ పండుగ సందర్భంగా అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో ప్రభల ఉత్సవం నిర్వహించనున్నారు.
Read Also: KTR: నేడు సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్‌పై విచారణ..
ప్రభల ఉత్సవానికి తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాల్లో ప్రాధాన్యత ఉంది.. ఈ ప్రభల తీర్థాన్ని వీక్షించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి భారీగా తరలి రానున్నారు భక్తులు.. జగన్నతోటలో కొలువు కానున్న ఏకాదశ రుద్రులను దర్శించు కునేందుకు ఎడ్ల బండ్లపై రావడం ఇక్కడి ప్రత్యేకత. ఎగువ కౌశిక నదిలో నుండి పీకల లోతు నీటిలో మునిగి ప్రభలను భుజాలపై మోసుకుని వచ్చే అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతం కానుంది.. ఏ విధమైన ఆలయం లేకుండా కేవలం కొబ్బరి తోటలోకి ఏడాదికి ఒక్కసారి జరుపుకునే ఉత్సవం ఈ ప్రభల ఉత్సవం. జగ్గన్నతోటలో ప్రభల తీర్థంకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.. అంబాజీపేట, అయినవిల్లి, పి.గన్నవరం, మామిడికుదురు మండలాల నుండి జగ్గన్నతోటకు ప్రభల ఊరేగింపులు చేరుకోనున్నాయి..
అంబాజీపేట మండలంలో ఏకాదశ రుద్రులు కొలువైన పదకొండు గ్రామాలలో ప్రభల ఊరేగింపులు కొనసాగనున్నాయి.. ఈ నేపథ్యంలో పి. గన్నవరం సీఐ భీమరాజు ఆద్వర్యంలో ప్రభల తీర్ధాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.. కోనసీమ నడుమ తరతరాల నుండి జరుగుతున్న “జగ్గన్నతోట” ప్రభలతీర్థం వైభవానికి ఎంతో ప్రఖ్యాత ఉంది . మకర సంక్రమణ ఉత్తరాయణ మహాపుణ్యకాలంలో సంక్రాంతి కనుమ నాడు కోనసీమలోని మొసలిపల్లి శివారు జగ్గన్నతోటలో జరిగే ఏకాదశ రుద్రుల సమాగమము అత్యంత ప్రాచీనమైన, చారిత్రాత్మకమైన, అతిపురాతనమైన, పవిత్రమైన సమాగమం. ప్రాచీనకాలంలో మొట్టమొదటిగా ఈ తోటలోనే ఈ పదకొండు గ్రామాల రుద్రులు సమావేశమయ్యారని ప్రతీతి. ఈ తోటలో ఏవిధమైన గుడి గానీ, గోపురం గానీ ఉండవు.. ఇది పూర్తిగా కొబ్బరితోట. ఈ ఏకాదశరుద్రులు సంవత్సరానికి ఒకసారి ఇక్కడ సమావేశం అవ్వడంతో ఈ తోట విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ఏకాదశరుద్రుల కొలువు. హిందూధర్మశాస్త్రాల ప్రకారం.. ఏకాదశరుద్రులు ఒక్కచోటకొలువు తీరేది ప్రపంచం మొత్తం మీదా, ఈ భూమండలం మొత్తానికీ ఒక్కచోటే అదీవేదసీమ అయినటువంటి కోనసీమలోనే.. లోక కల్యాణార్ధం ఈ పదకొండు గ్రామాలశివుళ్లు జగ్గన్నతోటలో సమావేశం అయ్యి లోక విషయాలుచర్చిస్తారని ప్రతీతి. సుమారు 400 సంవత్సరాల క్రితం నుండి ఈ సంప్రదాయం ఉందనీ తీవ్రమైన పరిస్థితులు వచ్చిన 17 వశతాబ్ధంలో ఈ 11 గ్రామాల రుద్రులు ఈ తోటలోనే సమావేశం అయ్యి.. లోక రక్షణగావించారని ప్రతీతి. అప్పటి నుండీ క్రమం తప్పకుండా ప్రతీ సంవత్సరమూ కనుమ రోజు ఎన్ని అవాంతరాలు ఎదురైనా , భూమి తల్లక్రిందులైనా ఈ రుద్రులను ఒక్కచోట చేర్చుతారు ఈ గ్రామస్తులు. సంస్థానదీశులైన శ్రీరాజావత్సవాయి జగన్నాధమహారాజుకు చెందిన ఈతోట జగ్గన్న తోట అనే పేరుతో స్థిరపడినట్టు చెబుతారు..