YS Jagan: మెగా డీఎస్సీపై జగన్ సంచలన ఆరోపణలు.. అర్హత లేనివారికి ఉద్యోగాలా?

Ys Jagan Speech

Ys Jagan Speech

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీపై వివాదం కొనసాగుతూనే ఉంది.. పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది.. మరోవైపు, మెగా డీఎస్సీ నియామకాలపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. అర్హత లేని అభ్యర్థులకు ఉద్యోగాలు కట్టబెట్టారనే సాక్ష్యాలు బయటకు వస్తున్నాయని ఆయన ఆరోపించారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు అంగీకరించడం లేదని ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఆయన పలు ఆరోపణలు చేస్తూ పోస్టు చేశారు.

కర్నూలు స్పోర్ట్స్ కోటా నియామకంపై ప్రశ్నలు
కర్నూలులో టెట్‌లో 75 మార్కులు రావాల్సిన అభ్యర్థికి 65 మార్కులు మాత్రమే వచ్చినప్పటికీ స్పోర్ట్స్ కోటాలో ఎస్‌జీటీ పోస్టు ఎలా ఇచ్చారని జగన్ ప్రశ్నించారు. వన్ టు వన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో అర్హత లేదని తెలిసినా పోస్టు ఎలా ఇచ్చారని నిలదీశారు. దరఖాస్తు దశలోనే తిరస్కరించాల్సిన అభ్యర్థి అన్ని దశలను దాటి ఉద్యోగం ఎలా పొందారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో అధికారులతో ఈ పని చేయించిన ‘అదృశ్య శక్తి’ ఎవరో చెప్పాలని, అది లోకేష్ కాదంటారా అంటూ జగన్ ప్రశ్నించారు. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో డీఎస్సీ-2025లో ఇలాంటి అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని ఆయన ఆరోపించారు.

ప్రభుత్వ విచారణపై జగన్ సందేహాలు
చంద్రబాబు ప్రభుత్వం తన అధికారులతో నిర్వహించే విచారణలు నిజాయితీగా, స్వతంత్రంగా జరుగుతాయా అని జగన్ ప్రశ్నించారు. లోకేష్ రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఉంటే, చంద్రబాబు కింద పనిచేసే అధికారులు స్వతంత్రంగా వ్యవహరించగలరా అని నిలదీశారు. అందుకే డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌పై మొదటి నుంచీ సీబీఐ విచారణ కోరుతున్నామని తెలిపారు. నిజాయితీపరులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా కోర్టులోనూ పోరాడుతున్నామని జగన్ పేర్కొన్నారు. డీఎస్సీ నుంచి ఏపీపీఎస్సీ వరకు ఇదే తరహా అక్రమాల విధానం పాకించారని చంద్రబాబుపై ఆరోపణలు చేశారు.

జీవో నంబర్-4పై ఆరోపణలు
అటవీశాఖలో ఫైనాన్స్ క్లియరెన్స్ పొందిన 814 పోస్టులకు నోటిఫికేషన్, మెయిన్స్ పరీక్షలు పూర్తయ్యాక 40 స్పోర్ట్స్ కోటా పోస్టులను పరీక్ష లేకుండా భర్తీ చేసేందుకు జీవో నంబర్-4ను ఉపయోగించారని జగన్ ఆరోపించారు. డీఎస్సీ అక్రమాలు బయటపడటంతో అటవీశాఖ రిక్రూట్‌మెంట్‌ను మధ్యలో నిలిపివేశారని ఆయన అన్నారు. 40 స్పోర్ట్స్ కోటా పోస్టుల జాబితా బయటకు వస్తే మొత్తం వ్యవహారం వెలుగులోకి వస్తుందనే ఉద్దేశంతో మిగిలిన 774 పోస్టుల భర్తీని కూడా నిలిపివేశారని ఆరోపించారు.

చంద్రబాబు, లోకేష్‌పై తీవ్ర వ్యాఖ్యలు
డీఎస్సీ అక్రమాల వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నారనే కారణంతోనే సీబీఐ విచారణకు ప్రభుత్వం అంగీకరించడం లేదని జగన్ ఆరోపించారు. ఉద్యోగాలు పొందిన వారితో ర్యాలీలు నిర్వహించి ప్రచారం చేయించినా, నిజాయితీపరులైన ఉద్యోగార్థులకు జరిగిన నష్టాన్ని కప్పిపుచ్చలేరని వ్యాఖ్యానించారు. చంద్రబాబు గారూ.. మెగా డీఎస్సీలో అర్హత లేనివారికి ఉద్యోగాలు ఇచ్చారంటూ సాక్ష్యాలు బయటకు వస్తున్నాయని, డీఎస్సీ వ్యవహారాన్ని సీబీఐ విచారణకు ఇవ్వకుండా ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారని జగన్ ప్రశ్నించారు. యువతను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని నిలదీశారు.

లీకేజీ నుంచి పోస్టింగ్ ఆర్డర్ల వరకు విచారణకు డిమాండ్
లీకేజీ నుంచి స్పోర్ట్స్ కోటా వరకు, టెట్ అర్హతల నుంచి పోస్టింగ్ ఆర్డర్ల వరకు మొత్తం మెగా డీఎస్సీ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని జగన్ డిమాండ్ చేశారు. జీవో నంబర్-4 ఆధారంగా జరిగిన అన్ని నియామకాలను కూడా సీబీఐకి అప్పగించాలని మరోసారి కోరారు. పారదర్శక పరీక్షలు, నిష్పక్షపాత ఉద్యోగ నియామకాల కోసం పోరాడుతున్న ఉద్యోగార్థులు, యువతకు వైసీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని జగన్ తెలిపారు. మెగా డీఎస్సీ నిజాయితీపరులైన అభ్యర్థుల పాలిట ‘దగా’గా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.