YS Jagan: డీఎస్సీ-2025లో స్పోర్ట్స్ కోటా నియామకాలపై మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు చేశారు. పరీక్షలు రాయకుండానే కొందరికి ఉద్యోగాలు ఇచ్చారని, జరగని క్రీడా పోటీలు జరిగినట్లు చూపిస్తూ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు సృష్టించారని ఆరోపించారు. ఒక పద్ధతి ప్రకారం ఈ వ్యవహారం నడిపారని, తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయని అన్నారు. తాము చెబుతున్న ప్రతి అంశాన్ని సాక్ష్యాలు, ఆధారాలతో వివరిస్తున్నామని పేర్కొన్నారు.
జూడోలో 39 మందికి పరీక్ష లేకుండానే ఉద్యోగాలు
స్పోర్ట్స్ కోటాలో జూడో విభాగంలో 39 మందికి ఎలాంటి పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇచ్చారని జగన్ ఆరోపించారు. కొందరు అభ్యర్థులు ఖమ్మంలో సీనియర్ ఇంటర్-డిస్ట్రిక్ట్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నట్లు సర్టిఫికెట్లు సమర్పించారని తెలిపారు. అయితే ఆ పోటీలు ఖమ్మంలో జరగలేదని జూడో అసోసియేషన్ రాతపూర్వకంగా వెల్లడించిందని చెప్పారు. ఏపీ జూడో అసోసియేషన్ అధ్యక్షుడిగా చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు తోడల్లుడు భరత్ ఉన్నారని జగన్ ప్రస్తావించారు. దొంగ సర్టిఫికెట్లు సృష్టించి, వాటిని పెద్దలే ధ్రువీకరించినట్లు స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు.
సాఫ్ట్‌బాల్ సర్టిఫికెట్లపై ఆరోపణలు
సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వ్యవహారాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. ఆయన స్వయంగా సంతకాలు చేసి సర్టిఫికెట్లు ఇచ్చారని ఆరోపించారు. సాఫ్ట్‌బాల్‌లో ఎంపికైన 38 మందిలో 21 మందికి కూన రవికుమార్ సంతకాలతో సర్టిఫికెట్లు జారీ అయ్యాయని పేర్కొన్నారు.
‘కుటుంబానికే స్పోర్ట్స్ కోటా పోస్టులు’
విశాఖకు చెందిన యోగేశ్వరరావుకు స్పోర్ట్స్ కోటాలో SGT పోస్టు ఇచ్చారని జగన్ తెలిపారు. అదే కేటగిరీలో ఆయన చెల్లికి కూడా పోస్టు ఇచ్చారని, ఇది కుటుంబానికి ప్యాకేజీగా ఉద్యోగాలు ఇచ్చినట్లుగా ఉందని ఆరోపించారు. నల్గొండలో జరిగినట్లు పేర్కొన్న ఖోఖో ఛాంపియన్‌షిప్‌లో యోగేశ్వరరావుకు ఫస్ట్ ప్లేస్, ఆయన చెల్లికి సెకండ్ ప్లేస్ సర్టిఫికెట్లు ఇచ్చారని చెప్పారు. అయితే విజేతల జాబితాలో వారి పేర్లు లేవని తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ప్రకటించిందని పేర్కొన్నారు. ఈవెంట్లు ఎక్కడ జరిగాయో తెలుసుకుని, వాటి పేరుతో నకిలీ సర్టిఫికెట్లు సృష్టించారని జగన్ ఆరోపించారు.
ఏడు దశల వెరిఫికేషన్‌పైనా ప్రశ్నలు
ఉద్యోగాలు ఇచ్చే ముందు మొత్తం వెరిఫికేషన్ ప్రక్రియ ఏడుసార్లు జరిగిందని అధికారులు చెప్పారని జగన్ అన్నారు. 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను పిలిచి ఏడుసార్లు తనిఖీ చేసిన తర్వాతే నియామకాలు చేపట్టామని చెప్పినప్పటికీ, ఇన్ని దశలు దాటిన తర్వాత కూడా అక్రమాలు ఎలా జరిగాయని ప్రశ్నించారు. గుడివాడలో జరిగిన 49వ ఖోఖో ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నట్లు బసవేశ్వరరావుకు సర్టిఫికెట్లు ఇచ్చారని, అవి నకిలీవని శాప్‌కు అధికారికంగా లేఖ ద్వారా సమాచారం ఇచ్చారని తెలిపారు. అయినప్పటికీ ఆ లేఖను పక్కనపెట్టి నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం ఇచ్చారని ఆరోపించారు. ‘డీల్ కుదిరింది’ అంటూ పైనుంచి ఫోన్ వచ్చిన తర్వాతే ఉద్యోగం ఇచ్చారని జగన్ ఆరోపించారు.
కబడ్డీ సర్టిఫికెట్‌లోనూ ట్విస్ట్
ప్రగడ కల్యాణి అనే అభ్యర్థికి 2003లో నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ గేమ్స్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఆధారంగా ఉద్యోగం ఇచ్చారని జగన్ పేర్కొన్నారు. అయితే అక్కడ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ గేమ్స్ జరగలేదని, కేవలం సౌత్ వెస్ట్ జోన్ కబడ్డీ గేమ్స్ మాత్రమే జరిగాయని ఆరోపించారు. దీంతో సర్టిఫికెట్ వ్యవహారంపై అనుమానాలు తలెత్తుతున్నాయని అన్నారు.
టెట్ అర్హత లేకున్నా ఉద్యోగాలు?
కొన్ని కేసుల్లో టెట్ అర్హత లేకుండానే ఉద్యోగాలు ఇచ్చారని జగన్ ఆరోపించారు. ఒక కేటగిరీకి చెందిన టెట్ మార్కులను చూపించి మరో కేటగిరీలో పోస్టు ఇచ్చారని, ఒక కులానికి సంబంధించిన రిజర్వేషన్ ఉండగా మరో కులం కింద ఉద్యోగాలు కల్పించారని పేర్కొన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన ప్రభాకర్ అనే అభ్యర్థికి ఎలాంటి పరీక్ష రాయకుండానే ఉద్యోగం ఇచ్చారని ఆరోపించారు. ఆయన రిజర్వేషన్ కేటగిరీ ప్రకారం టెట్‌లో 75 మార్కులు రావాల్సి ఉండగా 65 మార్కులే వచ్చినా పోస్టు ఇచ్చారని చెప్పారు. ఉద్యోగం ఇచ్చే సమయంలో ఆయనకు 65 మార్కులు మాత్రమే వచ్చాయని కర్నూలు డీఈవో కూడా అంగీకరించారని జగన్ పేర్కొన్నారు.
‘పాత టెట్ మార్కులతో కవరప్’
ప్రభాకర్ పలుమార్లు టెట్ రాశారని, ఏదో ఒక పరీక్షలో అర్హత సాధించి ఉంటారని అధికారులు చెబుతున్నారని జగన్ అన్నారు. 2018 టెట్‌లో స్కూల్ అసిస్టెంట్ పేపర్-బీలో 77 మార్కులు వచ్చాయని, కానీ ఆయన అర్హత సాధించినది ప్రత్యేక పిల్లల కేటగిరీలో కాగా, ఉద్యోగం మాత్రం సాధారణ కేటగిరీలో ఇచ్చారని ఆరోపించారు. పాత టెట్ మార్కులను చూపించి ఈ వ్యవహారాన్ని సమర్థించుకోవడం కవరప్ ప్రయత్నమేనని విమర్శించారు. EWS రిజర్వేషన్ల పేరుతోనూ పెద్ద రాకెట్ నడిచిందని జగన్ ఆరోపించారు. కడప, కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాల నుంచి అనేక కేసులు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. కడప జిల్లాకు చెందిన రసూల్ గతంలో 2008, 2012, 2018లో బీసీ-ఈ కేటగిరీ కింద దరఖాస్తు చేశారని, కానీ ఇప్పుడు ఓసీ, EWS కేటగిరీలో ఉద్యోగం ఇచ్చారని ఆరోపించారు. 1:1 నిష్పత్తిలో పిలిచి, ఏడుసార్లు వెరిఫికేషన్ చేసిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చామని అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఇలాంటి అక్రమాలు ఎలా జరిగాయని జగన్ ప్రశ్నించారు. అర్హత లేని వారికి ఎవరి ఆదేశాలతో పోస్టులు ఇచ్చారో తేల్చాలని డిమాండ్ చేశారు.
‘ఫేక్ సర్టిఫికెట్లను ఒప్పుకోక తప్పలేదు’
టెట్ అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చిన అంశంపై అధికారులతో జరిగిన చర్చల్లో చంద్రబాబు ఒప్పుకోక తప్పలేదని జగన్ ఆరోపించారు. స్పోర్ట్స్ సర్టిఫికెట్లు సక్రమంగా ఉన్నాయని చెప్పలేకపోయారని, కొన్ని టోర్నమెంట్లు జరగకపోయినా సర్టిఫికెట్లు జారీ అయ్యాయని అంగీకరించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కూన రవికుమార్, భరత్‌కు సంబంధించిన అసోసియేషన్ల నుంచి ఫేక్ సర్టిఫికెట్లు వచ్చాయని కూడా ఒప్పుకోక తప్పలేదని జగన్ ఆరోపించారు. తాను మొదట ప్రస్తావించిన డీఎస్సీ స్కాం పునాదుల నుంచే ఈ అక్రమాలన్నీ బయటకు వస్తున్నాయని అన్నారు.
‘లోకేష్ ఆధ్వర్యంలో విచారణ ఎలా?’
అసలు పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలు ఇవ్వడమే డీఎస్సీలో అతిపెద్ద స్కామని జగన్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో పైనుంచి కిందివరకు అవినీతి, అక్రమాల ఆనవాళ్లు కనిపిస్తున్నాయని ఆరోపించారు. లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన తప్పులపై ఆయన ఆధ్వర్యంలోనే విచారణ జరిగితే వాస్తవాలు ఎలా బయటకు వస్తాయని ప్రశ్నించారు. ఇలాంటి సందర్భాల్లోనే ‘కాక్రోచ్‌లు’ బయటకు వస్తాయని, తనలాంటి వారు కూడా నిజాలను బయటపెట్టే కాక్రోచ్‌లుగా మారుతారని వ్యాఖ్యానించారు. నిజాయితీగల అభ్యర్థులు, నిరుద్యోగ యువత కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఏపీపీఎస్సీ నియామకాలపైనా ఆరోపణలు
డీఎస్సీ వ్యవహారం ఇంత పెద్దది కాకపోయి ఉంటే మరో స్కామ్‌కు తెరతీసేవారని జగన్ ఆరోపించారు. ఏపీపీఎస్సీలోనూ పరీక్షలు లేకుండా ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఫైనాన్షియల్ క్లియరెన్స్ పొందిన అటవీ శాఖ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రయత్నించారని, ఇందుకోసం డీఎస్సీలో ఉపయోగించిన జీవో నంబర్ 4నే వినియోగించారని ఆరోపించారు. స్పోర్ట్స్ కోటాలో మొత్తం 40 పోస్టులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారని, డీఎస్సీ వ్యవహారం పెద్దదవడంతో ఈ విషయం కూడా బయటపడుతుందనే భయంతోనే ఆ నియామకాలను నిలిపివేశారా అని జగన్ ప్రశ్నించారు.

