YS Jagan: డీఎస్సీలో తవ్వేకొద్దీ అక్రమాలు.. అది అంటేనే చంద్రబాబుకు బీపీ పెరిగిపోతుంది..!

Ys Jagan

Ys Jagan

YS Jagan: డీఎస్సీ-2025పై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ అధినతే, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌.. డీఎస్సీలో అవకతవకలపై ‘డీఎస్సీ స్కాం పార్ట్‌-1’లో వివరాలు వెల్లడించామని .. ఇప్పుడు ‘డీఎస్సీ స్కాం పార్ట్‌-2’లో మరిన్ని అక్రమాలను కేస్‌ స్టడీలతో సహా ప్రజల ముందుకు తీసుకురాబోతున్నామని తెలిపారు. ప్రభుత్వంలోని కొందరు వ్యక్తులు అక్రమాలకు పాల్పడి, నిరుద్యోగులు, నిజాయితీగా పరీక్ష రాసిన అభ్యర్థులకు అన్యాయం చేశారని ఆరోపించారు.

ఇది మెగా డీఎస్సీ కాదు.. నిరుద్యోగులను దగా చేశారు
డీఎస్సీ-2025ను మెగా డీఎస్సీగా ప్రచారం చేసినప్పటికీ, వాస్తవానికి నిరుద్యోగులను, నిజాయితీ కలిగిన అభ్యర్థులను దగా చేశారని జగన్ విమర్శించారు. మెగా డీఎస్సీ కుంభకోణంపై లోతుగా పరిశీలిస్తే తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయని అన్నారు. ఈ స్కాం తాలూకు రూపాలు అనకొండలా విస్తరిస్తున్నాయని వ్యాఖ్యానించారు. అయితే, డీఎస్సీ అవకతవకలకు సంబంధించి ఆధారాలు బయటపెడుతున్న వారిపై కేసులు పెట్టడం, బెదిరింపులకు పాల్పడుతున్నారని జగన్ ఆరోపించారు. చివరకు ఈ వ్యవహారంపై వార్తలు రాస్తున్న జర్నలిస్టులపైనా కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా నడుస్తుందో ఈ పరిణామాలు అద్దం పడుతున్నాయని విమర్శించారు.

‘డీఎస్సీ అంటే చంద్రబాబుకు బీపీ పెరుగుతుంది’
గతంలో తాను అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ ఇప్పటివరకు సరైన సమాధానాలు ఇవ్వలేదని జగన్ అన్నారు. డీఎస్సీ అంటేనే చంద్రబాబుకు బీపీ పెరుగుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా, డీఎస్సీ చరిత్రలోనూ ఇలాంటి స్కాం ఎప్పుడూ చూడలేదని ఆరోపించారు. ఇక, డీఎస్సీ ప్రశ్నపత్రాల తయారీ, పర్యవేక్షణ బాధ్యతలను ఒకే వ్యక్తి చేతిలో ఎందుకు పెట్టారనే ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. ఈ నిర్ణయంతోనే స్కాం ద్వారాలు తెరుచుకున్నాయని ఆరోపించారు. దీనిపై ప్రశ్నలు లేవనెత్తితే సమాధానాలు ఇవ్వకుండా తమ వాదనలను బుల్డోజ్ చేస్తున్నారని విమర్శించారు.

SCERT ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌ వ్యవహారంపై ఆరోపణలు
ప్రశ్నపత్రాల తయారీలో కీలకమైన SCERT విభాగంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసిన నవీన్‌కు ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చిందని జగన్ ప్రశ్నించారు. ఫస్ట్ ర్యాంక్ సాధించినప్పటికీ అతనికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. మెరిట్ లిస్ట్‌లో అతని పేరు ఉన్నప్పటికీ దాన్ని ఎందుకు మార్చారని ప్రశ్నించారు. మరి, నవీన్‌కు సంబంధించిన ఐడీని ఎందుకు బ్లాక్ చేశారని జగన్ ప్రశ్నించారు. ఫస్ట్ ర్యాంక్ సాధించిన అభ్యర్థిని వెరిఫికేషన్‌కు ఎందుకు పిలవలేదని నిలదీశారు. తనను వెరిఫికేషన్‌కు పిలవలేదని నవీన్ లిఖితపూర్వకంగా లేఖ కూడా రాశారని జగన్ పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే నవీన్ కోర్టును ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చిందని ప్రశ్నించారు.

‘స్కాంను దాచే ప్రయత్నం కాదా?’
నవీన్ వ్యవహారంలో చోటుచేసుకున్న పరిణామాలన్నింటినీ ప్రస్తావిస్తూ.. ఇవన్నీ డీఎస్సీ స్కాంను దాచే ప్రయత్నం కాదా? అని జగన్ ప్రశ్నించారు. ప్రశ్నపత్రాల తయారీ నుంచి మెరిట్ లిస్ట్, వెరిఫికేషన్ వరకు జరిగిన పరిణామాలపై సమగ్రంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. డీఎస్సీ ప్రశ్నపత్రంలో ఉన్న ప్రశ్నలను కూడా అమ్ముకున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోందని జగన్ ప్రస్తావించారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ-2025లో జరిగినట్లు ఆరోపిస్తున్న అన్ని అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి, నిరుద్యోగులు, అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు.