Janasena: హైదరాబాద్‌లో నిర్వహించిన రాజ్యభాష విభాగం స్వర్ణోత్సవ వేడుకల్లో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.. అయితే, దీనిపై జనసేన పార్టీ స్పందించింది.. భిన్నత్వంలో ఏకత్వం, జాతీయ సమగ్రత, భాషా సామరస్యంపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆలోచన విధానమపి స్పష్టం చేసింది.. మాతృభాషకు ప్రథమ ప్రాధాన్యత.. సమాజంలో మన గుర్తింపుకు మూలం మాతృభాషే అని స్పష్టం చేసింది జనసేన. బాల్యంలో విద్యాభ్యాసానికి, మన సంస్కృతులను కాపాడుకోవడానికి మాతృభాష తప్పనిసరిగా ఉండాలన్నది పవన్ అభిప్రాయమని.. బహుభాషా ప్రావీణ్యం జీవితంలో ఎదిగేందుకు ఒక సాధనం అని పేర్కొన్నారు.. అది జ్ఞానాన్ని అందించడమే కాకుండా, భిన్న సంస్కృతుల ప్రజలతో మమేకం అయ్యేందుకు, అవకాశాలను మెరుగుపరచేందుకు తోడ్పడుతుందని పేర్కొంది.
Read Also: MP Mithun Reddy: ఎంపీ మిథున్‌రెడ్డికి షాకిచ్చిన హైకోర్టు..
అన్ని భాషలను గౌరవించాలి.. ఏ భాషను బలవంతంగా రుద్దవద్దని పవన్ కల్యాణ్ అన్నారు అని జనసేన స్పష్టం చేసింది. ప్రతీ భాషకు సముచిత గౌరవం ఇవ్వటం కనీస బాధ్యత. భాషను గౌరవిస్తూ, అది ప్రజలను కలిపే వారధిగా పనిచేస్తుందని పార్టీ స్పష్టం చేసింది. భాషను బలవంతంగా రుద్దితే అది ప్రజలను విడదీస్తుందన్న అభిప్రాయాన్ని వెల్లడించింది. హిందీని బలవంతంగా రుద్దడం లేదు.. కానీ, హిందీ వల్ల ప్రయోజనాలు అనేకం అని తెలిపింది. హిందీ భాషను ఖచ్చితంగా నేర్చుకోవాలనే విధానానికి పవన్ కల్యాణ్ ఎప్పుడూ వ్యతిరేకమే. అయితే, ఉద్యోగ అవకాశాల కోసం, విభిన్న ప్రాంతాల ప్రజలతో మమేకం అయ్యేందుకు హిందీని నేర్చుకోవడం వల్ల ఫలితాలే తప్ప నష్టం ఏమీ లేదని పార్టీ పేర్కొంది. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ అస్తిత్వం. భాషా వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడం ద్వారా భారతదేశం మరింత సమగ్రాభివృద్ధిని సాధించగలదని, ఫెడరల్ స్ఫూర్తిని కాపాడగలదని పవన్ కల్యాణ్ అభిప్రాయం అని జనసేన తెలిపింది..
