Site icon NTV Telugu

Deputy CM Pawan Kalyan: టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ.. హోటళ్లు, ట్రావెల్స్‌పై ప్రత్యేక నిఘా..

Deputy Cm Pawan Kalyan

Deputy Cm Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి, ఉపాధి కల్పన, భద్రత, మౌలిక సదుపాయాలపై పవన్‌ కల్యాణ్‌ కీలక దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల్లో “ఆంధ్రప్రదేశ్ పర్యటకం సురక్షితం” అనే భావన తప్పనిసరిగా కలగాలని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఈ లక్ష్యంతో రాష్ట్రంలో టూరిజం సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ పాలసీని కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. టూరిజం అభివృద్ధిలో భద్రతే తొలి అజెండా అని స్పష్టంగా పేర్కొన్నారు.

Read Also: Bhatti Vikramakra : విద్యుత్ ఉద్యోగులకు భట్టి కానుక.. 17.651 శాతం డీఏ ఖరారు..

పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక బిహేవియర్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ప్రవర్తనా నియమావళి) అమలు చేయాలని, ముఖ్యంగా కుటుంబ పర్యటకులు, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పవన్‌ కల్యాణ్‌ సూచించారు. నియమావళి ఉల్లంఘనలకు కఠిన చర్యలు తీసుకోవాలని, హోటళ్లు, ట్రావెల్స్‌, టూరిజం సంబంధిత కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు పవన్‌ కల్యాణ్.. టూరిజం హాట్‌స్పాట్లలో హెలీపోర్టుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని, నిర్ణీత కాలవ్యవధిలో ప్రాజెక్టుల అమలు తప్పనిసరిగా ఉండాలని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ఎకో టూరిజం ప్రాంతాల్లో లా అండ్ ఆర్డర్‌పై కఠిన నియంత్రణ ఉండాలని, ప్రకృతి సంపదకు హాని కలగకుండా అభివృద్ధి జరగాలని సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఒకే తరహా ఆర్కిటెక్చర్‌తో ఏపీ గుర్తింపు (AP Identity) స్పష్టంగా కనిపించేలా నిర్మాణాలు ఉండాలని డిప్యూటీ సీఎం అన్నారు. 974 కిలోమీటర్ల తీరప్రాంతాన్ని సమర్థంగా వినియోగించుకుంటూ అడ్వెంచర్ టూరిజం, బోట్ రేసులు, వాటర్ స్పోర్ట్స్‌కు విస్తృత అవకాశాలు కల్పించాలని సూచించారు. అలాగే కొండ ప్రాంతాల్లో ట్రెక్కింగ్‌, మౌంటెనీరింగ్‌ వంటి కార్యకలాపాలకు ప్రోత్సాహం ఇవ్వాలని అన్నారు. పార్వతీపురం మన్యం వంటి ప్రకృతి సంపద ఉన్న ప్రాంతాలను వారసత్వ సంపదగా పరిరక్షిస్తూ అభివృద్ధి చేయాలని, పర్యాటకంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంచాలని పవన్‌ కల్యాణ్‌ సూచించారు. అదేవిధంగా సాహితీ సర్క్యూట్‌, స్పిరిట్యువల్ సర్క్యూట్‌ల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. మొత్తంగా, భద్రత, క్రమశిక్షణ, ప్రకృతి పరిరక్షణ, ఉపాధి కల్పనతో కూడిన సమగ్ర టూరిజం అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

 

Exit mobile version