Sajjala Ramakrishna Reddy: తిరుమల లడ్డూ వివాదంపై వైఎస్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన బాధ్యత పూర్తిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిదేనని ఆయన ఆరోపించారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న అంశంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ చేపట్టిందని సజ్జల గుర్తు చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేయడం తీవ్ర తప్పిదమని అన్నారు. ఈ అంశం కోట్లాది మంది భక్తుల విశ్వాసాలకు సంబంధించినదైనందున టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారని తెలిపారు.
Read Also: Katasani Ram Bhupal Reddy: పవన్ కల్యాణ్‌పై కాటసాని హాట్ కామెంట్స్..
దేశంలోనే అత్యంత విశ్వసనీయమైన సంస్థలు చేసిన ల్యాబొరేటరీ పరీక్షల నివేదికలు, రెండు సందర్భాల్లోనూ తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టంగా వెల్లడించాయని సజ్జల చెప్పారు. అయినప్పటికీ చంద్రబాబు తన ఆరోపణలను వెనక్కి తీసుకోకుండా, ఇంకా అదే తరహా ప్రచారం కొనసాగిస్తున్నారని మండిపడ్డారు సజ్జల.. సీఎం చంద్రబాబు దురుద్దేశాలు బయటపడ్డాయని, అబద్ధమని నిర్ధారణ అయిన తర్వాత కూడా కొత్త అబద్ధాలు సృష్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. విచారణ మొత్తం జంతువుల కొవ్వు అంశంపైనే జరిగిందని, ఇప్పుడు వేరే కంపెనీల పేర్లు తెరపైకి తీసుకురావడం కుట్రలో భాగమేనని ఆరోపించారు. టీడీపీ హయాంలో ఉన్న హర్ష్ డెయిరీనే తర్వాత భోలే బాబా డెయిరీగా మారిందని, గత ప్రభుత్వ హయాంలో అసలు భోలే బాబా డెయిరీ నుంచి నెయ్యి తీసుకోలేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ కాలంలో టెక్నికల్ ఇన్స్పెక్షన్ అనంతరం భోలే బాబాను బ్లాక్‌లిస్ట్ చేశామని తెలిపారు.
ఏఆర్ డెయిరీ నుంచి తీసిన నమూనాలపై పరీక్షలు జరిగాయని, ఎక్కడా రికార్డుల్లో భోలే బాబా పేరు లేదని సజ్జల వెల్లడించారు. టీటీడీ లేదా టీటీడీ బోర్డు సభ్యులపై కూడా ఎలాంటి ఆరోపణలు లేవన్నారు. గతంలో భోలే బాబాను ప్రోత్సహించింది టీడీపీ ప్రభుత్వమేనని చెప్పారు. నిజంగా వైవీ సుబ్బారెడ్డి తప్పు చేసి ఉంటే ఆయనే సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్తారని ప్రశ్నించారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి ఆరోపణలు ఎలా చేశారని సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించిందని గుర్తు చేశారు. చంద్రబాబు తెలిసిన ఏకైక విద్య ఎదుటి వ్యక్తిని కోలుకోకుండా ప్రచారం చేయడమేనని, వ్యక్తిత్వ హననం ఆయన రాజకీయ విధానమని సజ్జల తీవ్రంగా వ్యాఖ్యానించారు. ల్యాబ్ రిపోర్టుల్లో ఎక్కడా పామాయిల్, కెమికల్స్ లేదా జంతువుల కొవ్వు కలిశాయనే విషయం లేదని స్పష్టం చేశారు. టీటీడీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని, భక్తులకు మరింత మెరుగైన సదుపాయాలు కల్పించాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. చంద్రబాబు చేసిన నిరాధార ఆరోపణలకు ఆధారాలు ఆయనే చూపాల్సిన అవసరం ఉందన్నారు.
చంద్రబాబు ఒక్క మాటతోనే భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఇప్పటికీ లడ్డూను అపవిత్రం చేసేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. రాజకీయంగా విమర్శలు చేసుకోవచ్చు కానీ దేవుని విషయంలో ఎందుకని ప్రశ్నించారు సజ్జల… వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం నిజాల్ని మాత్రమే నమ్మే నాయకుడని, ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తే చంద్రబాబు చేసిన ఆరోపణలు తప్పు అని ప్రజలకు అర్థమైందని చెప్పారు. ఈ వ్యవహారంపై అన్ని కోణాల్లో న్యాయపరంగా కూడా పరిశీలన చేస్తున్నామని తెలిపారు. ఇక, పవన్ కల్యాణ్.. చంద్రబాబుకంటే ఇంకా పెద్ద ఆరోపణలు చేస్తూ జంతువుల కొవ్వు, చేప నూనె అంటూ వ్యాఖ్యలు చేశారని, అయోధ్య వరకు ఈ అంశాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారని సజ్జల గుర్తు చేశారు. ఇప్పుడు పవన్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. నేషనల్ డెయిరీ ఇన్‌స్టిట్యూట్స్ ఇచ్చిన ల్యాబ్ రిపోర్టులు ఈ ఆరోపణలు పచ్చి అబద్ధాలని స్పష్టం చేశాయని సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు.
