Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?

Tirumala

Tirumala

Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమల: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు తిరుమలలో వైభవంగా జరగనున్నాయి. ఇప్పటికే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఇవాళ సాయంత్రం కీలకఘట్టమైన ధ్వజారోహణం కార్యక్రమం జరగనుంది. దీంతో, తిరుమల గిరుల్లో బ్రహ్మోత్సవ శోభ కనిపిస్తోంది. నిన్న సాయంత్రం బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. శ్రీవారి త‌ర‌పున సేనాధిపతి అయిన విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం ఆలయంలోని యాగశాలలో భూమాత‌కు ప్రత్యేక పూజ‌లు నిర్వహించి, పుట్ట మన్నులో న‌వ‌ధాన్యాలను నాటారు వేద పండితులు, ఆలయ అర్చకులు. వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. ఇక, ఈ రోజు సాయంత్రం మీన లగ్నంలో ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహిస్తారు ఆలయ అర్చకులు.

ఇక, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు తిరుమలలో వైభవంగా జరగనున్న నేపథ్యంలో.. ప్రతి రోజు శ్రీవారికి వివిధ వాహన సేవలు నిర్వహించనున్నారు.. నేడు సాయంత్రం మీన లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనసేవతో వాహన సేవలు ప్రారంభమవుతాయి. రేపు ఉదయం 8 గంటలకు చిన్నశేష వాహన సేవ, రాత్రి 7 గంటలకు హంస వాహన సేవ నిర్వహించనున్నారు. ఎల్లుండి ఉదయం 8 గంటలకు సింహ వాహన సేవ, రాత్రి 7 గంటలకు ముత్యపుపందిరి వాహన సేవ జరగనుంది.

18వ తేదీన ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహన సేవ, రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహన సేవ నిర్వహిస్తారు. 19వ తేదీన ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, రాత్రి 6:30 గంటలకు గరుడ వాహన సేవ జరగనుంది. 20వ తేదీన ఉదయం 8 గంటలకు హనుమంత వాహన సేవ, సాయంత్రం 4 గంటలకు స్వర్ణరథ ఊరేగింపు, రాత్రి 7 గంటలకు గజ వాహన సేవ నిర్వహించనున్నారు. 21వ తేదీన ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహన సేవ, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహన సేవ జరుగుతుంది. 22వ తేదీన ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 8 గంటలకు అశ్వ వాహన సేవ నిర్వహించనున్నారు. చివరి రోజైన 23వ తేదీన ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్య చక్రస్నానం నిర్వహిస్తారు. అనంతరం రాత్రి ధ్వజావరోహణంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

* ఇవాళ రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనసేవ

* రేపు ఉదయం 8 గంటలకు చిన్నశేష వాహన సేవ.. రాత్రి 7 గంటలకు హంస వాహనసేవ

* ఎల్లుండి ఉదయం 8 గంటలకు సింహ వాహనసేవ.. రాత్రి 7 గంటలకు ముత్యపుపందిరి వాహనసేవ

* 18వ తేదీ ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహన సేవ.. రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనసేవ

* 19వ తేదీ ఉదయం 8 గంటలకు మోహిని అవతారం.. రాత్రి 6:30 గంటలకు గరుడ వాహనసేవ

* 20వ తేదీ ఉదయం 8 గంటలకు హనుమంత వాహనసేవ.. సాయంత్రం 4 గంటలకు స్వర్ణరథ ఊరేగింపు.. రాత్రి 7 గంటలకు గజ వాహనసేవ

* 21వ తేది ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనసేవ.. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనసేవ

* 22వ తేదీ ఉదయం 7 గంటలకు రథోత్సవం .. రాత్రి 8 గంటలకు అశ్వవాహన సేవ..

* 23న తేది ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య చక్రస్నానం.. రాత్రి ధ్వజాఅవరోహణంతో ముగియనున్న వార్షిక బ్రహ్మోత్సవాలు