Saikrishna Lockup Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం..

Sai Krishna Custodial Death

Sai Krishna Custodial Death

Saikrishna Lockup Death Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. సాయికృష్ణ లాకప్ డెత్, అదృశ్యం కేసుపై విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది. జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఉదయం విచారణ జరగగా.. లంచ్ బ్రేక్ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు మరోసారి కోర్టు ముందు హాజరయ్యారు. విచారణ సందర్భంగా సాయికృష్ణ అదృశ్యం కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సాయికృష్ణ తల్లి దాఖలు చేసిన కేసును సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్‌పై హైకోర్టులో తీర్పు వాయిదా పడిందని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తెలిపారు.

అలాగే సాయికృష్ణ హెబియస్ కార్పస్ పిటిషన్‌తో పాటు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ దాఖలైన ఐఏఎల్‌ (ఇంటర్‌లొక్యూటరీ అప్లికేషన్స్)పై కూడా హైకోర్టు తీర్పును వాయిదా వేసినట్లు వెల్లడించారు. అయితే హైకోర్టు ఏయే పిటిషన్లపై తీర్పును వాయిదా వేసిందనే దానిపై స్పష్టమైన వివరాలను రేపు ఉదయానికి సమర్పించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. హైకోర్టులో సాయికృష్ణ కేసులకు సంబంధించిన విచారణలు ఏ దశలో ఉన్నాయో స్పష్టత వచ్చిన తర్వాత తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం తెలిపింది. రేపు ఉదయం 10.30 గంటలకు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులు, విచారణ పూర్తయి తీర్పు దశలో ఉన్న కేసుల పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని పిటిషనర్లు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అదేవిధంగా ఏపీ హైకోర్టులో సాయికృష్ణ కేసులపై జరుగుతున్న విచారణలకు స్టే విధించాలన్న అంశాన్ని కూడా సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది. హైకోర్టులోని సాయికృష్ణకు సంబంధించిన కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలన్న అభ్యర్థనపై నిర్ణయాన్ని కూడా రేపటికి వాయిదా వేసింది. ఉదయం విచారణ సందర్భంగా ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను కొనసాగించాలా లేదా అన్న అంశంపై కూడా రేపు నిర్ణయం వెల్లడిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టులో కేసుల ప్రస్తుత స్థితిపై పూర్తి సమాచారం అందిన అనంతరం తదుపరి ఆదేశాలు ఇస్తామని పేర్కొంటూ విచారణను రేపు ఉదయం తొలి కేసుగా చేపట్టనున్నట్లు తెలిపింది.