AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్‌ డీజిల్‌ కొరత ప్రభావం.. లిమిట్‌ పెంచిన బంక్‌లు..

  • ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత ప్రభావం తగ్గుముఖం..
  • పలు జిల్లాల్లో ఇంధన సరఫరా సాధారణ స్థితికి..
  • పెట్రోల్ బంకుల వద్ద తగ్గిన రద్దీ..
  • కిలోమీటర్ల క్యూలకు ముగింపు..
Petrol and Diesel Prices

Petrol and Diesel Prices

AP Fuel Crisis: ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు రోజులుగా తీవ్రంగా కనిపించిన పెట్రోల్, డీజిల్ కొరత ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ముఖ్యంగా విజయవాడ నగరంలో పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితి సాధారణ స్థితికి చేరుతోంది. నిన్న, మొన్నటి వరకు కిలోమీటర్ల మేర కనిపించిన వాహనాల క్యూలు ఇప్పుడు గణనీయంగా తగ్గాయి. ఇప్పటికే ఆయిల్ కంపెనీలు అదనపు ట్యాంకర్ల ద్వారా ఇంధన సరఫరాను పెంచడంతో పలు జిల్లాల్లో పరిస్థితి మెరుగుపడుతోంది. పెట్రోల్ బంకుల వద్ద రద్దీ తగ్గిపోవడంతో వాహనదారులు ఊరట చెందుతున్నారు.

Read Also: Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..

నిన్నటివరకు నాలుగు చక్రాల వాహనాలకు రూ.1500 వరకు మాత్రమే పెట్రోల్ ఇచ్చే పరిమితి ఉండగా, ఈరోజు దానిని రూ.2000కు పెంచారు. అలాగే రెండు చక్రాల వాహనాలకు రూ.500 వరకు ఇంధనం అందిస్తున్నారు. ఇక, గతంలో గంటన్నరకు పైగా క్యూలో నిలబడి పెట్రోల్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండగా, ప్రస్తుతం కేవలం 10 నిమిషాల్లోనే ఇంధనం లభిస్తోందని వాహనదారులు చెబుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఇంధన సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటోందని అధికారులు తెలిపారు. బంకుల వద్ద ‘నో స్టాక్‌ బోర్డ్స్’ లేకుండా చూడాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి పెట్రోల్, డీజిల్ కొరతతో ఇబ్బందులు పడ్డ ప్రజలకు ఇప్పుడు కొంత ఊరట లభిస్తోంది. రానున్న రోజుల్లో సరఫరా పూర్తిగా సాధారణ స్థితికి చేరుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే, రియాల్టీలోకి వస్తే ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నో స్టాక్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి.. ఆ ప్రాంతాల్లో కూడా పెట్రోల్ కష్టాలకు చెక్‌ పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.. కాగా, పెట్రోల్‌, డీజిల్‌ కొరత వార్తల నేపథ్యంలో.. సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు..