Site icon NTV Telugu

Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ పాలన మరింత బలోపేతం.. కీలక సంస్కరణలకు పవన్‌ శ్రీకారం..

Deputy Cm Pawan Kalyan

Deputy Cm Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పంచాయతీరాజ్ పాలనను మరింత బలోపేతం చేస్తూ, గ్రామ స్వరాజ్య సాధన దిశగా కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల మంత్రి పవన్ కల్యాణ్‌.. గ్రామీణ స్థాయిలో పరిపాలన వ్యవస్థను పూర్తిగా మార్చే దిశగా క్యాంపు కార్యాలయంలో శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల్లో .. క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి హోదా, ఉద్యోగుల ప్యాట్రన్, పనితీరు వ్యవస్థపై సమీక్ష నిర్వహిస్తూ, భవిష్యత్ సంస్కరణల రూపురేఖలను మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టంగా వివరించారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతం కావాలని, ప్రజలలో సేవలపై మరింత సంతృప్తి పెరగాలంటే పరిపాలన వ్యవహారాలు మారాలని ఆయన వెల్లడించారు.

Read Also: Gudivada Amarnath: విశాఖ గురించి వైఎస్‌ జగన్‌ చెప్పిందే.. చంద్రబాబు చెబుతున్నారు..

స్వచ్చ రథం, మ్యాజిక్ డ్రెయిన్ వంటి పైలట్ ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ.. ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే ఇలాంటి నూతన ఆలోచనలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఉందని సూచించారు పవన్‌ కల్యాణ్.. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుధ్య రంగాల్లో విస్తృత మార్పులు తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. జల్ జీవన్ మిషన్ పనులపై నిరంతర పర్యవేక్షణ కోసం సాంకేతికపరంగా శాఖను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. నీటి సరఫరా పథకాలు సమర్థంగా అమలు అవ్వాలని, నీటి నాణ్యత పరీక్షలు కచ్చితంగా జరుగాలని అధికారులను ఆదేశించారు. నిర్వహణ పనులను సమయానుకూలంగా చేపట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

ఇక, ఉపాధి హామీ పథకం అమలు, పర్యవేక్షణపై కూడా విస్తృతంగా సమీక్ష నిర్వహించారు పవన్‌ కల్యాణ్‌… గ్రామ సభ తీర్మానాలకు అనుగుణంగా పనులు చేపట్టే బాధ్యత ప్రతి ఉద్యోగిపై ఉందని, ఈ పథకం ద్వారా శ్రామికుల్లో సానుకూలత పెంచే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల్లో తీసుకువచ్చే ప్రతి సంస్కరణ ప్రజలకు ప్రత్యక్ష మేలు చేకూర్చేలా ఉండాలని పవన్ దిశానిర్దేశం చేశారు. శాఖల్లో అమలు చేయాల్సిన సంస్కరణలు, బెస్ట్ ప్రాక్టీసెస్‌పై సమగ్ర నివేదికను త్వరితగతిన సమర్పించాలని పేషీ అధికారులకు ఆదేశించారు. ఈ అంశంపై వారం రోజుల్లో మరో సమీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజ, ఓఎస్డీ వెంకట కృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version