Site icon NTV Telugu

IPS Officer Siddharth Kaushal Resigns: ఐపీఎస్ సిద్ధార్థ కౌశల్ వీఆర్ఎస్‌పై కొత్త చర్చ..

Siddharth Kaushal

Siddharth Kaushal

IPS Officer Siddharth Kaushal Resigns: సీనియర్‌ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశల్ వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేయడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్ గా మారిపోయింది.. ఏపీలోని కృష్ణాజిల్లా, కర్నూలు జిల్లా, ప్రకాశం, కడప జిల్లాలకు వైసీపీ ప్రభుత్వ సమయంలో సిద్ధార్థ కౌశల్ ఎస్పీగా పని చేశారు.. ప్రజలకు చెరువగా ఉండేందుకు వాళ్లతో మమేకం అయ్యేందుకు సిద్ధార్థ కౌశల్ తన మార్క్ పనితీరుతో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రధానంగా బాధితులు నేరుగా తనను కలిసేందుకు సోషల్ మీడియా ఖాతాలలో యాక్టివ్ గా ఉండేవారు. దీంతోపాటు తన ఫోన్ నెంబర్లు అందరికీ తెలియజేసి.. ఏ సమస్యను అయినా తానే పరిష్కరించేందుకు సిద్ధమయ్యారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం వల్ల సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గురించి ఆయా జిల్లాల్లో పనిచేసిన ప్రజలందరికీ సుపరిచితం. వైసీపీ ప్రభుత్వ సమయంలో ఆయన ప్రధాన జిల్లాలకు ఎస్పీగా పని చేశారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్రాధాన్య పోస్టులో ప్రస్తుతం ఆయన కొనసాగుతున్నారు. డీజీపీ కార్యాలయంలో ఏఐజీ లా అండ్ ఆర్డర్ పోస్ట్ లో ప్రస్తుతం సిద్దార్ధ కౌశల్ ఉన్నారు. ఇక్కడి నుంచి ఆయన వీఆర్ఎస్ కు దరఖాస్తు చేశారు.

Read Also: Snake At Cricket Ground: అయ్యబాబోయ్.. మ్యాచ్ జరుగుతుండగానే మైదానంలో ప్రత్యక్షమైన పాము.. వీడియో వైరల్

2012 ఐపీఎస్ బ్యాచ్ లో ఏపీ క్యాడర్ కు చెందిన సిద్ధార్ధ కౌశల్.. 13 ఏళ్ల పాటు ఐపీఎస్ గా విధులు నిర్వర్తించారు. ఇంత చిన్న సమయంలో వీఆర్ఎస్ కు దరఖాస్తు చేయటం పోలీస్ వర్గాల్లో చర్చకు కారణమైంది. ప్రస్తుతం సీనియర్ ఎస్పీ (ఎస్ఎస్పీ)గా ఉన్న సిద్ధార్ధ కౌశల్ వచ్చే ఏడాది అంటే 2026 జనవరికి డీఐజీ ర్యాంకు అధికారి ప్రమోషన్ అయ్యే వారని ఉన్నతాధికారులు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో కీలకంగా పలు జిల్లాల్లో విధులు నిర్వహించిన సిద్ధార్థ కౌశల్.. 2024 ఎన్నికల సమయంలో కడప ఎస్పీగా పనిచేశారు. వైసీపీ హయాంలో ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారనే ఆరోపణలతో కూటమి ప్రభుత్వం ఆయన్ని టార్గెట్ చేసిందనేది వైసీపీ వాదనగా ఉంది.. సిద్ధార్థ కౌశల్ మాత్రమే కాకుండా అనేకమంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా పక్కన పెట్టిందని ఈ కారణంగానే ఐపీఎస్ లు కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్నారు అనేది వైసీపీ వాదన. జత్వాని కేసులో అక్రమంగా ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాన టాటా, విశాల్ గున్నీలను నిందితులుగా చేర్చారని వారికి ఇప్పటివరకు పోస్టింగ్ లేకుండా సస్పెన్షన్ లో ఉంచారని వైసీపీ చెబుతోంది. ఇదే సమయంలో కొందరు ఐపీఎస్ అధికారులు కేంద్ర సర్వీసులకు వెళ్తున్నారని కూడా వైసీపీ ఆరోపణలు చేస్తోంది. సిద్ధార్థ కౌశల్ వీఆర్ఎస్ వెనుక కూడా ఇదే కారణం అనేది సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

Read Also: Telangana Govt: అంగన్వాడి హెల్పర్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

ఇక, తన వీఆర్ఎస్ నిర్ణయంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి నేరుగా సిద్ధార్థ కౌశల్ తెర దించారు. తన రాజీనామా నిర్ణయం వెనుక వ్యక్తిగత కారణాలు ఉన్నాయి.. తప్ప..! బలవంతపు కారణాలు, వేధింపులు ఏమీ లేవని ఆయన ఓ ప్రకటన విడుదల చేయటం ద్వారా స్పష్టం చేశారు. నార్త్ ఇండియాకు చెందిన సిద్ధార్ధ కౌశల్.. కార్పొరేట్ సంస్థలో జాయిన్ అవటంపై మొగ్గు చూపటంతో ఐపీఎస్‌కు వీఆర్ఎస్ ఇచ్చారని సమాచారం. మరో నాలుగేళ్లపాటు అప్రాధాన్యత కలిగిన పోస్టులోనే ఉండాల్సిన పరిస్థితి ఏపీలో ఉంటుందనే ఆలోచనతో కూడా ఇలా చేసి ఉంటారనే చర్చ కూడా పొలీస్ వర్గాల్లో జరుగుతోంది. కీలక జిల్లాలకు సిద్ధార్ధ కౌశల్ ఎస్పీగా పనిచేసినా.. ఎక్కడా కూడా ఆయనపై పెద్ద స్థాయిలో ఆరోపణలు ఏవీ రాలేదు. వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నానేది ఆయనపై విమర్శలు ఉన్నాయి. సోషల్ మీడియాలో తన వీఆర్ఎస్ నిర్ణయంపై జరుగుతున్న ప్రచారం కేవలం అవాస్తమని అందులో ఏమాత్రం నిజం లేదని సిద్ధార్ధ కౌశల్ ఓ ప్రకటన ద్వారా ఖండించారు. ఏపీలో పనిచేసిన సమయంలో సహకరించిన ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తాను ఒక కొత్త మార్గంలో ప్రజలకు మరింత మెరుగైన సేవను అందించడానికి మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటనలో వెల్లడించారు. అయితే, ఆయన ఏ మార్గంలో ప్రజలకు సేవ చేయనున్నారు అనే అంశానికి సంబంధించి క్లారిటీ ఇవ్వలేదు. అయితే సిద్ధార్థ కౌశల్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా అనే చర్చ కూడా జరుగుతున్నప్పటికీ దానిమీద ఎటువంటి క్లారిటీ ఇంకా రాలేదు.

Exit mobile version