Cyclone Montha: మొంథా తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సచివాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.. హోంమంత్రి అనిత, సీఎస్ కె.విజయానంద్, ఆర్టీజీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. వచ్చే 48 గంటల పాటు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. వర్షాలతో రహదారులపై పేరుకుపోయిన మట్టి, బురదను తొలగించేందుకు అగ్నిమాపక శాఖ తగిన చర్యలు చేపట్టాలి.. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో గృహాలు, వాణిజ్య సముదాయాలకు వందశాతం విద్యుత్ ను పునరుద్ధరించాలి.. వర్షాలకు దెబ్బతిన్న వివిధ పంటలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు పంటనష్టం అంచనాలను రూపొందించండి.. మొంథా తీవ్ర తుఫాను ప్రభావంతో జరిగిన ప్రాణనష్టం, దెబ్బతిన్న నిర్మాణాలను నివేదించాలని ఆదేశించారు.
Read Also: Cyclone Montha: మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. రైల్వే స్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు..
ఇక, వంతెనలు, కల్వర్టులను పర్యవేక్షించడంతో పాటు వర్షాల ధాటికి దెబ్బతిన్న చెరువులు, కుంటలు, కాలువ గట్లను పటిష్టపరిచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు మంత్రి లోకేష్.. ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా తగిన ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టడంతో పాటు పాము కాటుకు ఉపయోగించే యాంటీ వీనం ఔషధాలను అందుబాటులో ఉంచాలి.. పారిశుద్ధ్యం నిర్వహణతో పాటు ముంపు ప్రాంతాల్లో ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టండి అని సూచించారు.. మత్స్యకారులు, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అవసరమైన నిత్యావసర సరకులను పంపిణీ చేయాలని మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లకు స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్..
